Minister KTR Palamur Tour:రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమానికి సహకరించకుండా… భాజపా నేతలు చిల్లర విమర్శలు చేస్తున్నారని మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జడ్చర్ల మండలం.. కోడ్గల్‌లో రెండు పడక గదుల ఇళ్లను ప్రారంభించారు. 40 రెండు పడక గదుల ఇళ్లను లబ్ధిదారులకు అందించారు. తెలంగాణ ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశంలో… రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధిస్తోందని కేటీఆర్ అన్నారు. సీఎం వేలాది గిరిజన తండాలను గ్రామపంచాయతీలుగా మార్చారని.. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న గిరిజనుల ఆకాంక్షను నెరవేర్చారని పేర్కొన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా తెలంగాణ తరహాల్లో గ్రామీణాభివృద్ధి జరిగిందా అని… భాజపా, కాంగ్రెస్‌లను ప్రశ్నించారు.
''మన పల్లెల్లున్నట్లు.. దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా.. ఒక్క పల్లె ఉందా? దయచేసి కాంగ్రెస్, భాజపా నేతలు చూపించాలని కోరుతున్నాను. మీరు పోయి చూడండి ఉత్తరప్రదేశ్‌లో పురుగుల అన్నం పెడతారు అక్కడ పిల్లలకు. అట్లాంటి పరిస్థితి ఉంది అక్కడ. కానీ తెలంగాణలో ముఖ్యమంత్రి మనవరాలు, మనవడు ఏ బియ్యంతో అన్నం తింటారో.. అదే సన్నబియ్యంతో మన పేదింటి పిల్లల కడుపు నింపుతున్న ప్రభుత్వం.. తెలంగాణ ప్రభుత్వం. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వమంటే.. కేంద్రం ఇవ్వలేదు. ప్రధానమంత్రిని స్వయంగా వేడుకున్నా ఇవ్వలేదు. అదే పక్క రాష్ట్రమైన కర్ణాటకలోని ప్రాజెక్టుకి జాతీయ హోదా ఇచ్చారు. బడ్జెట్లో కేంద్రం తెలంగాణకు మొండిచెయ్యి చూపించింది. కేంద్రం సహకరించినా.. సహకరించకపోయినా.. మీ తోడు ఉన్నంత వరకు అభివృద్ధి జరుగుతుంది.''