తెలంగాణ

telangana

ETV Bharat / state

'కేంద్ర నిధులపై అమిత్​షావి అబద్ధాలు.. నేను చెప్పింది తప్పయితే రాజీనామా చేస్తా' - minister ktr devarakadra tour

KTR Comments: మంత్రి కేటీఆర్​.. శనివారం మహబూబ్​నగర్​ జిల్లాలోని దేవరకద్ర నియోజకవర్గంలో పర్యటించారు. పేరూరు వద్ద రూ.55 కోట్లతో ఎత్తిపోతలకు శంకుస్థాపన చేశారు. వర్నె వద్ద ఆర్‌అండ్‌బీ రోడ్డుపై రూ.18 కోట్లతో వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. భూత్పూర్‌ మున్సిపాలిటీలో క్రీడా ప్రాంగణ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.

minister ktr comments on center released funds at devarakadra
minister ktr comments on center released funds at devarakadra

By

Published : Jun 4, 2022, 3:49 PM IST

Updated : Jun 5, 2022, 4:24 AM IST

'కేంద్ర నిధులపై అమిత్​షావి అబద్ధాలు.. నేను చెప్పింది తప్పయితే రాజీనామా చేస్తా'

KTR Comments: తెలంగాణకు నిధులు ఇవ్వకుండా కేంద్రం వివక్ష చూపుతోందని పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్‌ ఆరోపించారు. ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్‌షా మాట్లాడుతూ తెలంగాణకు కేంద్రం రూ.2.52 లక్షల కోట్లు ఇచ్చిందని, తమతో మంచిగా ఉంటే ఇంకా ఎక్కువ ఇచ్చేవాళ్లమని చెప్పడంపై మండిపడ్డారు. ఈ ఎనిమిదేళ్లలో పన్నుల రూపంలో కేంద్రానికి తెలంగాణ రూ.3,68,797 కోట్లు చెల్లించిందని చెప్పారు. ఇప్పటి వరకు రాష్ట్రానికి రూ.1.68 లక్షల కోట్లు మాత్రమే కేంద్రం ఇచ్చినట్లు స్పష్టం చేశారు. కేంద్రానికి, దేశంలోని ఇతర రాష్ట్రాలకు తెలంగాణ ప్రజల చెమట, రక్తంతో రూ.2 లక్షల కోట్లు ఇచ్చామన్నారు. తాను చెప్పింది తప్పయితే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని దేవరకద్ర నియోజకవర్గం వేదికగా సవాలు విసురుతున్నట్లు వెల్లడించారు. అమిత్‌షా చెప్పింది తప్పయితే ఆయన తెలంగాణ గడ్డ మీదకు వచ్చి ముక్కు నేలకు రాసి క్షమాపణ చెబుతారా అని సవాలు విసిరారు. మహబూబ్‌నగర్‌ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో రూ.119 కోట్లతో, నారాయణపేట జిల్లాలోని కోస్గిలో రూ.40.65 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు కేటీఆర్‌ శనివారం ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా భూత్పూర్‌ పురపాలికలోని అమిస్తాపూర్‌, కోస్గి బహిరంగ సభల్లో ఆయన మాట్లాడారు.

‘‘గ్రామాల్లో పలు అభివృద్ధి పనులను రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుంటే అన్నీ కేంద్రమే చేస్తోందని భాజపా నేతలు ప్రకటిస్తున్నారు. పక్కన ఉన్న కర్ణాటకలో తెలంగాణలో అమలవుతున్న ఒక్క సంక్షేమ పథకమైనా ఉందా. పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా పాలమూరును సస్యశ్యామలం చేయాలని సీఎం పట్టుదలగా పని చేస్తుంటే కొంత మంది సైంధవ పాత్ర పోషిస్తూ అడ్డుకుంటున్నారు. ఈ ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇస్తామని గతంలో ప్రధాని మోదీ ప్రకటించారు. సుష్మాస్వరాజ్‌ కూడా హామీ ఇచ్చారు. దీనిని అమలు చేయకుండా పాదయాత్రల పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారు.

కాంగ్రెస్‌ ఏం చేసింది...

75 ఏళ్లలో కాంగ్రెస్‌ 10 సార్లకు పైగానే అధికారంలోకి వచ్చింది. దేశంలో ఏ కాంగ్రెస్‌ ప్రధాని, సీఎం చేయని అభివృద్ధి, సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్‌ ఈ ఎనిమిదేళ్లలో తీసుకొచ్చారు. ఇటీవల రాష్ట్రానికి వచ్చిన కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ రైతు డిక్లరేషన్‌ పేరుతో పార్టీ అధికారంలోకి వస్తే అది చేస్తాం.. ఇది చేస్తాం అంటూ తప్పుడు ప్రచారం చేశారు. వారు అధికారంలో ఉన్న 50 ఏళ్లలో వాటిని ఎందుకు అమలు చేయలేదు. రాహుల్‌, రేవంత్‌రెడ్డిలు ఆకాశం నుంచి ఊడిపడినట్లు మాట్లాడతారు. రాష్ట్రం ఇవ్వకపోతే తెలంగాణ ప్రజలు ఛీ కొడతారని గత్యంతరం లేక ఇచ్చారే.. తప్ప మర్యాదగా ఇవ్వలేదు. ఇక్కడి నుంచి గతంలో ఎమ్మెల్యేగా గెలిచిన ఓ వ్యక్తి (కోస్గిలో మాట్లాడుతూ)బ్లాక్‌మెయిల్‌, దందాలకు పాల్పడతారు. ఆ మనిషిది ఐరన్‌ లెగ్‌. తెదేపాలో ఉన్నప్పుడు ఆ పార్టీ సీఎంను ఆగం చేశారు. ఇప్పుడు కాంగ్రెస్‌ను నాశనం చేయడానికి హస్తం పార్టీలో చేరారు. రాష్ట్రంలో ఒకరు కులం పిచ్చి, మరొకరు మతం పిచ్చితో అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. దేశంలోని రెండు జాతీయ పార్టీలను బండకేసి కొట్టాలి. తెలంగాణ ప్రజలకు కేసీఆర్‌ నాయకత్వమే శ్రీరామరక్ష. ఈ నెల 2 నాటికే సర్పంచులందరికీ బిల్లులు అందించాం. కేంద్రం రూ.1,400 కోట్లు ఇవ్వాలి. గల్లాపట్టి కేంద్రం నుంచి ఆ బిల్లులను సర్పంచులు వసూలు చేయాలి’ అన్నారు.

కేసీఆర్‌ ఆలోచనలను అందిపుచ్చుకున్న కేటీఆర్‌..

సీఎం కేసీఆర్‌ ఆలోచనలను కేటీఆర్‌ అందిపుచ్చుకున్నారని మంత్రి ప్రశాంత్‌రెడ్డి అన్నారు. మరో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ.. కేసీఆర్‌ లేకుంటే తెలంగాణ ఉద్యమమే లేదన్నారు. రవాణా శాఖ మంత్రి అజయ్‌కుమార్‌, ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, డా.లక్ష్మారెడ్డి, నరేందర్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, బాలరాజు, రామ్మోహన్‌ రెడ్డి, అబ్రహాం, అంజయ్య యాదవ్‌, ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణరెడ్డి, దామోదర్‌రెడ్డి, సురభి శ్రీవాణి, ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌ పాల్గొన్నారు. కోస్గిలో కేటీఆర్‌ కాన్వాయ్‌ను అడ్డుకోవడానికి బయలుదేరిన భాజపా కార్యకర్తలను తెరాస శ్రేణులు నిలువరించాయి. పోలీసులు వారిని అక్కడి నుంచి పంపించివేశారు.

ఇవీ చూడండి:

Last Updated : Jun 5, 2022, 4:24 AM IST

ABOUT THE AUTHOR

...view details