కరోనా నిర్ధరణ అయిన వారు తప్పనిసరిగా 14 రోజులు ఐసోలేషన్‌లో ఉండాలి. వసతి, భోజనం, బాత్‌రూం అన్ని వేరువేరుగా ఏర్పాటు చేసుకోవాలి. పేద, మధ్య తరగతి వర్గానికి ఇది ఎంతో వ్యయంతో కూడుకున్న పని. ఈ సమస్యను నివారించేందుకు మహబూబ్‌నగర్ జిల్లా వైద్య యంత్రాంగం బాలనగర్, దేవరకద్ర, కోయల్కొండ మండలాల్లో మినీ కొవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేసింది. దేవరకద్రలోని మినీ కొవిడ్ కేర్ సెంటర్‌ను ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. 14 రోజుల పాటు ఈ కేంద్రంలో భోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు.
మహబూబ్‌నగర్ జిల్లాలో మినీ కొవిడ్ సెంటర్‌లు ప్రారంభం - Mini Kovid Centers in Mahabub nagar
కొవిడ్ పాజిటివ్ వచ్చిందంటే కరోనా సోకిందన్న బాధ కన్నా.. తమ వల్ల ఇతర కుటుంబసభ్యులకు వస్తుందేమోనని రోగులు ఆందోళనకు గురవుతున్నారు. ఒకటి, రెండు గదులు ఉండే పేద, మధ్య తరగతి వారు తమ వల్ల ఇంట్లో చిన్నారులు, వృద్ధులు వైరస్ బారిన పడతారని ఆందోళన చెందుతున్నారు. అటువంటి వారి కోసం ప్రభుత్వం మినీ కొవిడ్ సెంటర్‌లను ఏర్పాటు చేస్తోంది. మహబూబ్‌నగర్ జిల్లాలోని దేవరకద్రలో 50 పడకలతో మినీ కొవిడ్ సెంటర్‌లను ప్రారంభించారు. త్వరలోనే మిగిలిన మండలాల్లో ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నారు.
![మహబూబ్‌నగర్ జిల్లాలో మినీ కొవిడ్ సెంటర్‌లు ప్రారంభం మినీ కొవిడ్ సెంటర్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11609113-1036-11609113-1619904551606.jpg)
రోగుల ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించేందుకు 3 షిఫ్టుల్లో ఓ వైద్యాధికారి, స్టాఫ్ నర్సు, ఏఎన్ఎం, ఆశా వర్కర్లు అందుబాటులో ఉంటారు. పౌష్టికాహారం, మందులు అందజేస్తారు. పడకలు, మంచినీరు, మరుగుదొడ్లు వంటి మౌలిక వసతులు అందుబాటులో ఉంచారు. కొవిడ్ బారిన పడి స్పల్ప లక్షణాలు ఉండి, హోం ఐసోలేషన్‌లో ఉండలేని వారిని మినీ కొవిడ్ సెంటర్‌లో చేర్చుకుంటారు.
నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల, నారాయణపేట జిల్లాల్లోనూ కేసులు పెరుగుతున్న దృష్ట్యా.. ఆయా జిల్లాల్లో మరిన్ని ఐసోలేషన్ కేంద్రాలను పెంచేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.