సక్రమంగా అమలు కాని మధ్యాహ్న భోజన పథకం ప్రభుత్వ పాఠశాలలోని పిల్లలకు పౌష్టికాహారం అందించడం సహా విద్యార్థుల సంఖ్య పెంచడం కోసం మధ్యాహ్న భోజన పథకాన్ని (Mid Day Meals) ప్రభుత్వం ప్రవేశపెట్టింది. కానీ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఆ లక్ష్యం నెరవేరడంలేదు. పథకం అనుకున్నంత స్థాయిలో అమలు కావట్లేదు. కూరగాయలు, కోడిగుడ్లు రేట్లు పెరగడంతోపాటు మూడు, నాలుగు నెలలుగా బిల్లులు రాకపోవడం వల్ల ఏజెన్సీ సిబ్బంది సక్రమంగా మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయలేకపోతున్నారు.
నిర్వాహకుల ఇబ్బంది...
వారానికి 3 గుడ్లు, పండ్లు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఒక గుడ్డుకు 4 రూపాయలు ఇస్తుండగా... మార్కెట్‌లో మాత్రం ఐదున్నర నుంచి ఆరు రూపాయలు ఉంది. కూరగాయలకు కిలోకు 25 రూపాయలు ఇస్తుంటే మార్కెట్‌లో 40 నుంచి 60 రూపాయల మేర ఉన్నాయి. వంటనూనె 120 రూపాయలుంటే ప్రభుత్వం 75 రూపాయలే చెల్లిస్తుండటం వల్ల తీవ్ర ఇబ్బంది పడుతున్నామని నిర్వాహకులు చెబుతున్నారు.
నెలకు వెయ్యి...
వంట వండేవారికి నెలకు వెయ్యి రూపాయలు వేతనం అందిస్తున్నారు. కూలీకి వెళ్తే రోజుకు తక్కువలో తక్కువ 300 రూపాయలు వస్తున్నాయి. అందుకే వంట చేయడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపడంలేదు. ఇదే సమయంలో చిన్నారులకు భోజనం పెడుతున్న ఏజెన్సీ సిబ్బందికి నాలుగు నెలలుగా బిల్లులు రాలేదు. అప్పులు చేసి పిల్లలకు భోజనం పెడుతున్నామని అంటున్నారు.
45 రోజులుగా...
జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం ధర్మవరంలోని ప్రాథమిక పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 45 రోజులుగా మధ్యాహ్న భోజనాన్ని (Mid Day Meals) నిలిపివేశారు. మార్కెట్‌లో అన్ని రేట్లు పెరిగినా ప్రభుత్వం తక్కువ ఇస్తోందని వేతనం నెలకు వెయ్యి ఇస్తుండగా కూలీకి వెళ్తే అంతకంటే ఎక్కువ వస్తున్నాయని వంట చేయడం మానేశారు. మధ్యాహ్న భోజనం లేకపోవడం వల్ల విద్యార్థులు పగలు ఇళ్లకు వెళ్లి భోజనం చేసి వస్తున్నారు. దూరప్రాంతాల నుంచి వచ్చే పిల్లలు పస్తులుండాల్సి వస్తోంది.
ఏజెన్సీ సిబ్బందికి వేతనం పెంచడంతో పాటు... నెలనెలా బిల్లులు విడుదల చేయాలని కోరుతున్నారు. కూరగాయలు ధరలు పెరిగినందున అందుకు తగ్గట్లుగా రేటు పెంచాలని కోరుతున్నారు.
ఇదీ చూడండి:bjp corporators on attack: 'జీహెచ్ఎంసీ కార్యాలయంపై ఎలాంటి దాడులు చేయలేదు'