Dharani Problems: మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండలం కొత్తూరు, మల్లాపూర్ శివారులో తరతరాలుగా ప్రభుత్వ భూములను సాగుచేసుకుంటున్న రైతులు.. అధికారుల నిర్లక్ష్యం కారణంగా అన్యాయానికి గురవుతున్నారు. ఆ రెండు గ్రామాల శివారులోని 311 సర్వే నంబర్లో 245 ఎకరాల ప్రభుత్వ భూములున్నాయి. వాటిని 200 మందికి పైగా రైతులు తరతరాలుగా సాగుచేస్తున్నారు. 1954 నుంచి వంశపారంపర్యంగా వారికి సక్రమించిన పట్టాదారు పాసుపుస్తకాలు వారి వద్ద ఉన్నాయి. కానీ భూరికార్డుల ప్రక్షాళన తర్వాత అందులో చాలామంది రైతులకు కొత్త పాస్ పుస్తకాలు రాలేదు. బాధితుల్లో కొంతమంది ఇటీవలే మరణించారు. ధరణి పాస్ పుస్తకం లేకపోవడంతో రైతుబీమా అందలేదు. దీంతో ఆ కుటుంబాలు రోడ్డున పడ్డాయి.
భూమున్న పట్టాలు లేవు..
పండించిన పంటను అమ్ముకునేందుకు రైతన్నలు నానా అవస్థలు పడాల్సి వస్తోంది. కొత్త పట్టాదారు పాస్‌పుస్తకం లేకపోవడం వల్ల పంటల నమోదులో వారి పేర్లు ఉండటం లేదు. తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్న భూమికి... పట్టాలు రాక తిప్పలు పడుతున్నామంటూ రైతులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.