మత్స్యకారుల ఆర్థికాభివృద్ధి కోసం కోట్లు వెచ్చించి 100 శాతం రాయితీపై ప్రభుత్వం చేపపిల్లల్ని అందిస్తోంది. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత మత్స్యకార సంఘాలదేనని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పలుమార్లు స్పష్టం చేశారు. చేపల సైజు, సంఖ్యల్లో తేడాలుంటే నిర్దాక్షిణ్యంగా తిరస్కరించాలని ఎన్నోసార్లు సూచించారు. కానీ క్షేత్రస్థాయిలో అది అమలు కావడం లేదు.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో జలాశయాలు, చెరువులు, కుంటలన్నీ కలిపి 5 వేల వరకున్నాయి. వాటి విస్తీర్ణాన్ని బట్టి 12 కోట్ల చేప పిల్లలు అవసరమవుతాయి. ఆగస్టు 6 నుంచి ఇప్పటి వరకు సుమారు 3 కోట్ల 72 లక్షల చేపపిల్లల్ని పంపిణీ చేశారు. అయితే ఇదంతా సక్రమంగా జరగలేదనే ఆరోపణలు వస్తున్నాయి.
ఫిర్యాదు చేసినా..
మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలం అమిస్తాపూర్ చెరువులు, కుంటల్లో 75 వేల చేప పిల్లల్ని పిల్లలమర్రి కేంద్రం నుంచి తీసుకువచ్చి వదిలారు. చెరువులో విడిచిన గంటా, రెండు గంటల్లోనే 70శాతం వరకు చేపలు చనిపోయాయి. అధికారులకు, జిల్లా సంఘానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మత్సకారులు ఆరోపించారు.
రెండు సైజుల్లో చేప పిల్లల పంపిణీ..
మత్స్యకారులకు ప్రభుత్వం రెండు సైజుల్లో చేపపిల్లల్ని పంపిణీ చేస్తోంది. 35 మిల్లీమీటర్ల నుంచి 40 మిల్లీమీటర్ల పరిమాణాల్లో ఉండే చేపలను చెరువులు, కుంటల్లో వదులుతారు. వీటిని జిల్లాల్లోని నిల్వ కేంద్రాలకు తీసుకొచ్చి అక్కడ్నుంచి సంఘాలకు అందిస్తారు. అప్పగించే ముందే సరైన సైజు ఉన్నాయా?, లెక్క సరిగ్గా ఉందా? అన్నది చూపించి ఇవ్వాలి. కానీ చాలాచోట్ల తక్కువ సైజున్న పిల్లల్నే మత్స్యకారులకు అంటగడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.