ATMs theft case Details in Mahabubnagar: ఏటీఎంలో నగదు నింపిన కొన్నినిమిషాల్లోనే డబ్బంతా దోచుకెళ్తున్న అంతరాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా రాజాపూర్ మండల కేంద్రంలోని టాటా ఇండిక్యాష్ ఏటీఎం చోరీ కేసును సవాల్‌గా తీసుకున్న పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. ఈనెల 10న రాజాపూర్‌లోని టాటా ఇండిక్యాష్ ఏటీఏంలోని డబ్బు దొంగతనానికి గురైందని ఫిర్యాదు అందడంతో పోలీసులు విచారణ చేపట్టారు. దీంతో సీసీటీవీ, టోల్ గేట్ పుటేజీ, ఇతర ఆధారాలు సేకరించి ఓ ఫాస్ట్ ట్యాగ్ ఆధారంగా అసలు దొంగలెవరో కనిపెట్టారు.
సీసీటీవీలో రికార్డ్ అయిన కారు.. ఫాస్ట్ ట్యాగ్‌లో దొంగతనం జరిగిన ప్రాంతంలో తరచూ కనిపించడంతో ఆ కారుపై నిఘా ఉంచారు. మరో ఏటీఎం వద్ద చోరీకి ప్లాన్ చేసుకొని వచ్చిన ముఠా.. వెయిట్ చేస్తోంది. అదే సమయంలో అక్కడకు వచ్చిన పోలీసులు ఏటీఎం ముందు అనుమానాస్పదంగా కనిపించిన ఫార్చునర్‌ను తనిఖీ చేశారు. అనంతరం అందులోని వారిని అదుపులోకి తీసుకున్నారు. విచారించగా వారే ఏటీఎంలో నగదు చోరీ చేసినట్లు ఒప్పుకున్నారని జిల్లా ఎస్పీ నర్సింహా వెల్లడించారు. నిందితులకు ఏటీఎంలో నగదు నింపడం, మరమ్మతులు చేయడం, నిర్వహణలో అనుభవం ఉందని ఎస్పీ వివరించారు. ఈ గ్యాంగ్‌పై పంజాబ్, రాజస్థాన్, చండీగఢ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో కేసులున్నాయని తెలిపారు. వారి నుంచి రూ.5వేల నగదు, ఫార్చునర్ వాహనం, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
"ఈనెల 10న రాజాపూర్‌లోని టాటా ఇండిక్యాష్ ఏటీఏంలోని డబ్బు చోరీకి గురైంది. దీనిపై 16న మాకు ఫిర్యాదు అందింది. సీసీటీవీలు, టోల్ గేట్ పుటేజీలు, ఇతర ఆధారాలు సేకరించి ఓ ఫాస్ట్ ట్యాగ్ ఆధారంగా అసలు దొంగలెవరో కనిపెట్టాం. నిందితులంతా పంజాబ్ రాష్ట్రం భటిండా జిల్లాకు చెందిన వాళ్లు. వీరిలో గుర్ గగన్ సింగ్ బీసీఏ చదివాడు. ఏటీఎంలో నగదు నింపడం, మరమ్మతులు చేయడం, నిర్వహణలో అనుభవం ఉంది. ఈ అనుభవాన్ని చోరీలు చేసేందుకు వినియోగించారు. నిందితులు ముందుగా మాన్యువల్ పాస్ వర్డ్‌తో నగదు నింపే ఏటీఎంలను ఎంపిక చేసుకుంటారు. ఏటీఎంకు వైఫైతో నడిచే సీసీ కెమెరాను అమర్చుతారు. ఏజెన్సీ నగదు నింపేటప్పుడు ఎంటర్ చేసే పాస్ వర్డ్‌ను సీసీ కెమెరా ద్వారా చూసి నోట్ చేసుకుంటారు. నగదు నింపిన వాహనం వెళ్లిపోగానే వెంటనే అక్కడకు చేరుకుని అదే పాస్ వర్డ్‌ను ఎంటర్ చేసి ఏటీఎంను ఖాళీ చేస్తారు. అలా సంగారెడ్డి, నల్గొండ జిల్లా చిట్యాల ఏటీఎంలను సైతం దోచుకున్నారు. వీరిపై పంజాబ్, రాజస్థాన్, ఛండీగడ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో కేసులున్నాయి. నలుగురు నిందితుల్లో గురుగగన్ సింగ్, భూపేందర్ సింగ్‌ను అరెస్ట్ చేయగా రష్పాల్, సందీప్ సింగ్ పరారీలో ఉన్నారు. వారి నుంచి రూ. 5వేల నగదు, ఫార్చునర్ వాహనం, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నాం.-నర్సింహా, మహబూబ్‌నగర్ ఎస్పీ