చదువంటే ఆ చిట్టి తల్లికి ప్రాణం. పదిలో మంచి మార్కులు సాధించింది. ఇంటర్‌లో ఫస్ట్ క్లాస్‌లో పాసయ్యింది. ఇక నీట్ పరీక్షలో(NEET 2021 Ranks) సత్తా చాటి డాక్టర్ చదువుకోవాలని ఆశిస్తోంది. కానీ, పేదరికం(Financial problems) ఆమె కలల్ని చిదిమేస్తోంది. గతేడాది కూడా ఆర్థిక ఇబ్బందులతో ఇంటికే పరిమితమైనా యువతి... ఈ సారి తన కలను నిజం చేసుకోవాలని భావిస్తోంది. దాతల సహాయం కోసం కోటి ఆశలతో ఎదురుచూస్తోంది. మహబూబ్‌నగర్ పట్టణానికి చెందిన ఓ చదువుల సరస్వతి దుస్థితి ఇది.
పాఠశాల చదువు ఇలా..
మహబూబ్ నగర్ పట్టణానికి చెందిన నర్సింహులు- లక్ష్మి దంపతుల చిన్నకుమార్తె గోపిక చిన్నతనం నుంచే చదువుల్లో రాణిస్తోంది. పదో తరగతిలో 10/10, ఇంటర్‌లో ఫస్ట్ క్లాస్ మార్కులు సాధించింది. గతేడాది నీట్ పరీక్షల్లో మంచి ర్యాంకు వచ్చినా... చదివే స్థోమత లేక ఇంటికే పరిమతిమైంది. ఈ సంవత్సరం నీట్ ఫలితాల్లో 720 మార్కులకు గాను 613 మార్కులు సాధించి సత్తా చాటింది. జాతీయ స్థాయిలో 13,506 ర్యాంకు పొందింది. గాంధీ లేదా ఎయిమ్స్‌లో ఉచితంగా సీటు వచ్చే అవకాశం ఉంది. కానీ, గోపిక చదువుకు మరోసారి కటిక పేదరికం అడ్డంకిగా మారింది. దాతలెవరైనా ముందుకు వచ్చి సహాయం(Financial help) చేస్తే... కష్టపడి చదువుకుంటానని వేడుకుంటోంది.
ఆశతో ఎదురుచూపులు
ప్రాథమిక, ఉన్నత విద్యను దాతల సహకారంతోనే గోపిక నెట్టుకొచ్చింది. ఆమె చదువుకున్న ప్రైవేటు స్కూలు ప్రిన్సిపల్ చల్మారెడ్డి ప్రోత్సహాంతో ఇంటర్మిడీయట్ సహా నీట్ శిక్షణ పూర్తి చేసింది. ఆమె చదువుకు అయ్యే పూర్తి ఖర్చును భరించిన చల్మారెడ్డి.... వారి కుటుంబం నివసించటానికి రేకుల షెడ్డు ఇవ్వటంతో పాటు వ్యాపారానికి సైతం సహకారం అందించారు. గోపిక చదివిన కళాశాలల యాజమాన్యాలు, అధ్యాపకులు ఆర్థికంగా సాయం అందించారు. ప్రస్తుతం ఎంబీబీఎస్ లాంటి ఉన్నత విద్యా కోర్సుల్లో చేరే అవకాశం ఉన్న డబ్బుల్లేక చదువు నిలిపివేయాల్సిన దుస్థితి ఏర్పడింది. తన చదువుకు మరోసారి ఎవరైనా సహాయపడక పోతారా అని ఆశగా ఎదురుచూస్తోంది.