పంటకు పనికిరాని, సాగు చేసేందుకు వీలులేని విత్తనాలు రైతులకు అంటగట్టి సొమ్ముచేసుకుంటున్న అక్రమార్కుల పట్ల కఠినంగా వ్యవహరించాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో టాస్క్ ఫోర్స్ బృందాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. ఇటీవల టాస్క్ ఫోర్స్ బృందాలు జరిపిన దాడుల్లో మహబూబ్నగర్ జిల్లాలో 11 కేసులు, జోగులాంబ గద్వాల జిల్లాలో 8, నాగర్ కర్నూల్ జిల్లాలో 3, నారాయణపేట జిల్లాలో రెండు కేసులు నమోదయ్యాయి. వివిధ ప్రాంతాల్లో జరిపిన ఈ దాడుల్లో కాలం చెల్లిన పత్తి విత్తనాలు, ఎలాంటి ధ్రువపత్రాలు లేని విత్తనాలు, విడి విత్తనాలు, లాట్ నంబర్లు సరిగా లేని విత్తనాలు, కాలం చెల్లిన కూరగాయలు, ఆముదం, కంది, వరి విత్తనాలు లభ్యమయ్యాయి. వీటి విలువ సుమారు రూ. 50 లక్షలకు పైమాటే.
నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం. రహస్య దాడులు..
తాజాగా మహబూబ్నగర్ జిల్లా సీసీకుంట మండలం లాక్కోటలో అనుమతి లేని 92 లీటర్ల కలుపు నివారణ మందును స్వాధీనం చేసుకున్నారు. దేవరకద్ర, కౌకుంట్లో నిబంధనలకు విరుద్ధంగా విత్తనాలు నిల్వ ఉంచిన ఆరుగురు వ్యాపారులపైన తాజాగా కేసులు నమోదు చేశారు. ప్రతి జిల్లాలో మండల, డివిజన్, జిల్లా స్థాయిలో టాస్క్ ఫోర్స్ బృందాలు రంగంలోకి దిగి విస్తృంతంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. దాడులు ఎప్పుడు, ఎక్కడ, ఏ దుకాణాలపై చేయాలన్నది కూడా కేవలం ఉన్నతాధికారులకు తప్ప టాస్క్ ఫోర్స్ బృందాలకు ముందస్తు సమాచారం లేకుండా రహస్యంగా చేపడుతున్నారు. ఆకస్మిక దాడులతో పెద్దఎత్తున నకిలీ వ్యాపారం బండారం బైటపడుతోంది.
పత్తి విత్తనాలే.. ఆసరాగా అక్రమాలు
ప్రస్తుతం వానాకాలం పంటల సీజన్ ప్రారంభమైంది. ఈ సీజన్లో అన్ని జిల్లాల్లో అధికంగా సాగయ్యేది పత్తి పంటే. అందుకే పత్తి విత్తన వ్యాపారం జోరుగా సాగుతోంది. దీన్ని ఆసరాగా చేసుకుంటున్న కొంత మంది అక్రమార్కులు చౌకధరల ఆశచూపి రైతులకు నాసిరకం విత్తనాలు అంటగడుతున్నారు. ముఖ్యంగా జీఓటీ పరీక్షల్లో విఫలమైన విత్తనాలు కొనుగోలు చేసి, వాటిని తిరిగి ప్యాక్ చేసి రైతులకు తక్కువ ధర పేరిట విక్రయిస్తున్నారు. కాలం చెల్లిన విత్తనాలనూ అమ్ముతున్నారు. కొన్నిచోట్ల నిషేధిత హెర్బిసైడ్ టోలరేట్ బీటీ-3 రకం విత్తనాలను రైతులకందిస్తున్నారు. రాత్రికి రాత్రి గ్రామాలకు చేరుకోవడం విత్తనాలను రైతులకు విక్రయించడం చేస్తున్నారు.
మాకు చెప్పండి..
ఎలాంటి ప్యాకింగ్ లేకుండా, లాట్ నంబర్లు లేకుండా, తక్కువ ధరకు విడిగా విత్తనాలు ఎవరు అమ్మినా తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులు, వ్యవసాయశాఖ అధికారులు కోరుతున్నారు. అదే సమయంలో అధికారిక డీలర్ల వద్ద రశీదుతో తప్ప రైతులెవరూ ఎలాంటి విత్తనాలను కొనుగోలు చేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు.
నిఘా పెంచాల్సిందే..
ఈ ఏడాది వానాకాలం.. పత్తి విస్తీర్ణం గణనీయంగా పెంచాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో పాలమూరు జిల్లా సహా ఇతర ప్రాంతాల నుంచి విత్తన అక్రమ వ్యాపారులు ఇప్పటికే రంగంలోకి దిగినట్లుగా సమాచారం. తక్కువ ధర, కలుపు తీయాల్సిన అవసరం లేని విత్తనాలని చెప్పి రైతులకు ఇప్పటికే విత్తనాలు విక్రయిస్తున్నట్లుగా తెలుస్తోంది. స్థానికులు కొందరు మధ్య దళారులుగా మారి రైతులకు వాటిని అంటగడుతున్నారు. దుకాణ దారులు సహా ఇలాంటి వారిపైనా టాస్క్ ఫోర్స్ బృందాలు నిఘా మరింత పెంచాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.