భారత్‌పై కరోనా మళ్లీ తన పంజా విసురుతోంది. ముఖ్యంగా తెలంగాణ విద్యార్థుల్లో చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు మహబూబ్‌నగర్ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లాలో జనవరిలో 215, ఫిబ్రవరిలో 115, మార్చి 15 వరకూ 115 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
మహమ్మారి విజృంభిస్తున్నందున జిల్లా కలెక్టర్ వెంకట్రావు ఆదేశాల మేరకు జిల్లాలో వారం రోజుల ప్రత్యేక కార్యచరణ అమలు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో లక్షణాలున్నవారిని గుర్తించడం, పరీక్షలు నిర్వహిచడం, చికిత్స అందించే కార్యక్రమాన్ని చేపట్టారు. అందుకోసం 14 ఆర్బీఎస్కే బృందాలను రంగంలోకి దింపారు. వీరంతా పాఠశాలలకు వెళ్లి ముందుగా కరోనా లక్షణాలున్న వారిని గుర్తిస్తారు. అక్కడే ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలు నిర్వహిస్తారు. పాజిటివ్ అని తేలితే ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేస్తారు. నిర్ధరణ అయితే వారిని క్వారంటైన్లో ఉంచి చికిత్స అందిస్తారు.
అలా మహబూబ్‌నగర్ జిల్లాలో 17వ తేది నాటికి ఇద్దరు విద్యార్ధులు కరోనా బారిన పడినట్లు గుర్తించారు. 17వ తేదీ నాటికి ఆర్బీఎస్కే బృందాలు 78 పాఠశాలలను సందర్శించి, 10వేల మంది విద్యార్ధులను, 877 ఉపాధ్యాయుల్ని పరిశీలించారు.
గ్రామస్థాయిలో అంగన్వాడీ, ఆశా, రెవిన్యూ సహా ఇతర శాఖలకు సంబంధించిన సిబ్బంది గ్రామగ్రామాన ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. వారం రోజుల పాటు ఇది కొనసాగనుంది. లక్షణాలున్న వారికి కొవిడ్ పరీక్షలు నిర్వహించి నిర్ధరణ అయితే చికిత్స అందించనున్నారు. ఇవి కాకుండా జిల్లాలోని అన్నిప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, జిల్లా ఆసుపత్రిలో కరోనా పరీక్షలు కొనసాగుతున్నాయి. జిల్లాలో సుమారు 18వేల మందికి ఇప్పటికే టీకా వేశారు. 60ఏళ్లు పైబడిన వృద్ధులు, దీర్ఘకాలిక రోగులు తప్పనిసరిగా టీకా తీసుకోవాలని వైద్యారోగ్యశాఖ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఓ వైపు కేసులు పెరుగుతున్నాయని తెలిసినా ప్రజలు మాత్రం కొవిడ్ నిబంధనలు పట్టించుకోవడం లేదు. మాస్కు లేకుండానే బయట తిరిగే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. టీకా ఉందన్న ధీమాతో నిబంధనలు గాలికి వదిలేశారు. భౌతిక దూరం పాటించకుండా... చేతులు సబ్బుతో కడుక్కోవడం, శానిటైజర్లు వాడటం లాంటి నియమాల్ని మరిచిపోతున్నారు. శుభ కార్యాలు, కార్యక్రమాల పేరిట ఎక్కువ మంది జనం ఒకేచోట పోగవుతున్నారు. ఇలాగే నిర్లక్ష్యం చేస్తే సెకండ్ వేవ్ తప్పదని వైద్యారోగ్యశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
మహబూబ్‌నగర్ జిల్లాకు ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చే వారి సంఖ్య అధికమే. అధికారులు అలాంటి వారిపైనా దృష్టి పెట్టాలని జనం కోరుతున్నారు.