మహబూబ్‌నగర్ జిల్లాలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు అత్యధికంగా ఉన్నాయి. మహబూబ్‌నగర్, జడ్చర్ల, పోలేపల్లి పారిశ్రామికవాడలతోపాటు రాజాపూర్, బాలానగర్ మండలాల్లో పెద్దఎత్తున పరిశ్రమలు ఉన్నాయి. నారాయణపేట జిల్లాలో మక్తల్, కృష్ణా, మాగనూరు మండలాల్లో ఇటుక బట్టీలు.. నాగర్‌కర్నూలు జిల్లాలోని కల్వకుర్తి, అచ్చంపేట, నాగర్‌కర్నూలు ప్రాంతాల్లో చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఉన్నాయి. వనపర్తి జిల్లాలోనూ పెబ్బేరు, కొత్తకోట, వనపర్తి శివారు ప్రాంతాల్లో.. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రం శివారులో పరిశ్రమలు ఉన్నాయి. లాక్‌డౌను నేపథ్యంలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా చాలా పరిశ్రమలు మూతపడ్డాయి.
కేంద్రం తాజాగా ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ ద్వారా వీటికి లబ్ధి చేకూరనుంది. రుణాల చెల్లింపునకు, వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేసుకోడానికి కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ ఎంతో ఉపయోగపడుతుందని మహబూబ్‌నగర్ పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజరు రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో ఉన్న 2,812 సూక్ష్మ పరిశ్రమల వ్యాపార లావాదేవీలు రూ.25 లక్షలలోపు ఉండగా.. తాజా ప్యాకేజీతో రూ.కోటికి పెంచారు. 645 చిన్నతరహా పరిశ్రమల వ్యాపార లావాదేవీలు రూ.కోటి నుంచి రూ.10 కోట్లకు పెంచారు. మరో 69 మధ్యతరహా పరిశ్రమల లావాదేవీలను రూ.10 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకు పెంచారు. కొత్త ప్యాకేజీతో ఉమ్మడి పాలమూరులో పరిశ్రమలు మరింత బలోపేతమై లాక్‌డౌను కష్టకాలంలో వచ్చిన నష్టాలను భర్తీ చేసుకునే అవకాశాలున్నాయి.