యాసంగిలో ఏ పంటలు వేయాలి... రైతుల్లో గందరగోళం! Yasangi Crop confusion: యాసంగిలో వరిసాగు వద్దంటూ వ్యవసాయశాఖ క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తోంది. వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటల పైపు మొగ్గుచూపాలని రైతుల్ని కోరుతోంది. కాని క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులు, అధికారులు చెప్పే సూచనలు పరిగణలోకి తీసుకుంటున్న రైతులు ఏం చేయాలో తెలియని గందరగోళంలో ఉన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో సుమారు ఐదున్నర లక్షల ఎకరాల్లో గత యాసంగిలో వరిసాగైంది. ఈ వానాకాలంలోనూ ఏడున్నర లక్షల ఎకరాల్లో వరి వేశారు.
ఆరుతడి పంటలు కందులకు ఎకరాకు మూడు క్వింటాళ్లు వస్తే ఎకరాకు 5800 రేటు ఉంది. పోనీ 6వేలు వేసుకున్నా 18వేలు మాత్రమే వస్తాయి. అదే వరి వస్తే ఎకరాకు 20 నుంచి 30వేలు వస్తాయి. రైతు లాభం వచ్చే పంటలు మాత్రమే వేసుకోవాలనుంటాడు. ఇప్పుడు ఆరుతడి పంటలు వేసే సమయం అయిపోయింది. ప్రభుత్వ అధికారులు ఆరుతడి పంటలు వేయాలని చెబుతున్నారు. కానీ దిగుబడి అయితే రాదు.
-- మల్లు వెంకటేశ్వర్‌రెడ్డి, రైతు
ఇతర పంటలకు అవకాశం లేదు...
ఈ నేపథ్యంలో తరి, చౌడు పొలాల్లో ఇతర పంటలు పండే అవకాశం లేదు. సాగునీటి కాల్వలు, చెరువులు, జలాశయాలు, ఇతర నీటి వనరుల కింద ఏళ్లుగా వరిసాగు చేస్తున్న పొలాల్లో వరికి తప్ప మరో అవకాశం లేదు. అలాంటి ప్రాంతాల్లో రైతులు వరివైపే మొగ్గు చూపుతున్నారు. పెద్దకమతాలుండి, పశుసంపద అధికంగా ఉన్న రైతులు సైతం పశుగ్రాసం కోసం వరివైపు మళ్లుతున్నారు. ఐదెకరాలు సాగుచేసే చోట కనీసం 3ఎకరాలైనా వేయాలని రైతులు భావిస్తున్నారు. దొడ్డురకం కాకుండా ఈసారి సన్నరకాలైన తెలంగాణ సోనా, ఆర్అండ్ఆర్ వైపు రైతులు దృష్టి సారిస్తున్నారు.
రెండేళ్ల నుంచి వర్షాలు బాగా కురుస్తున్నాయి. ఆరుతడి పంటలు వేయడానికి భూములు ఆరడం లేదు. వేరే పంటలు వేయడానికి కుదరడం లేదు. మా భూమలన్ని చౌడు నేలల వరితప్ప వేరే పండటానికి ఆస్కారం లేదు.
-- రఘుపతి రెడ్డి, రైతు
నెలాఖరు వరకు కోతలు...
Yasangi Crop: ఉమ్మడి పాలమూరు జిల్లాలో నవంబర్ నెలాఖరు వరకూ కోతలు సాగాయి. డిసెంబర్ సగం గడిచిపోయింది. ప్రత్యాన్మాయంగా ఆరుతడి పంటలకు గడువు దాటిపోయింది. వేరుశనగ, మినుము, పెసర, శనగ, ఆముదం, కుసుమ, ఆవాలు లాంటి పంటలకు డిసెంబర్ 10వరకే అవకాశం ఉంది. ఆరుతడి పంటలకు పెట్టుబడులు తక్కువే. లాభాలూ తక్కువే. శ్రమ ఎక్కువ. వేరుశనగ లాంటి పంటలకు అడవి పందుల్లాంటి అటవీ జంతువుల నుంచి రక్షణ లేకుండా పోతోంది. చాలాచోట్ల కోతుల దాడికి భయపడి రైతులు కూరగాయలు మానేశారు. తెగుళ్లు, చీడపీడలదా డికి తట్టుకోలేక ఎక్కువమంది ఆరుతడి పంటల వైపు మొగ్గు చూపడం లేదు. కనీస మద్దతు ధరకంటే మెరుగైన ధర బహిరంగ మార్కెట్ లో దక్కుతున్నా, ఆశించిన దిగుబడులు లేక వేయడం లేదని రైతులు అంటున్నారు.
వరి పంట పండించడం వల్ల భూములు కూడా అలవాటుపడిపోయాయి. ఈ ప్రాంతంలో వరి, పల్లీలు మాత్రమే ఎక్కువగా పండిస్తున్నారు. గ్రౌండ్ వాటర్ పెరగడం వల్ల ఎక్కువ వరివైపే మొగ్గు చూపుతున్నారు. ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు వెళ్లడానికి ఇష్టపడటంలేదు.
-- దామోదర్ రెడ్డి, రైతు సంఘం అధ్యక్షుడు
ఆసక్తి చూపని రైతులు
జొన్న, నువ్వులు, పొద్దుతిరుగుడుకు జవనరి వరకూ అవకాశం ఉన్నా.. రైతులు ఆసక్తి చూపడం లేదు. వానాకాలంలో దీర్ఘకాలిక పంటలైన పత్తి, కంది వేసిన రైతులు యాసంగిలో తమ పొలాల్ని పడావు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. జనవరి తర్వాత మరోపంటకు అవకాశం లేకపోవడం వల్ల పంటవిరామం ఇవ్వనున్నారు. వ్యక్తిగత అవసరాలు, పశుగ్రాసం, అమ్మకం కోసం రైతులు ఉన్న భూముల్లోనే తక్కువ విస్తీర్ణంలో వరి వేయనున్నారు. మిగిలిన భూముల్ని పంటలు వేయకుండా వదిలేయనున్నారు. అలా వరిసాగు విస్తీర్ణం ఈ యాసంగిలో 50 నుంచి 60 శాతం తగ్గుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కాని ఆరుతడి పంటలు విస్తీర్ణం పెరుగే అవకాశాలు లేవని అంచనా వేస్తున్నారు.
Yasangi Crop: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పంటల సాగువిస్తీర్ణం సాధారణ సాగువిస్తీర్ణంతో పోల్చితే 40 శాతానికి మించలేదు. నాగర్‌కర్నూల్ జిల్లాలో మాత్రం 76 యాసంగిలో పంటలు సాగయ్యాయి. నాగర్‌కర్నూల్, వనపర్తి, మహబూబ్‌నగర్ జిల్లాలో అధికంగా వేరుశనగ, మినుపు, జోగులాంబ గద్వాల జిల్లాల్లో మినుము, పప్పుశనగ పంటల్ని రైతులు యాసంగిలో సాగు చేశారు.
ఇవీ చూడండి: