తెలంగాణ

telangana

By

Published : May 10, 2023, 9:55 AM IST

ETV Bharat / state

Mahbubnagar Farmers Problems : 'తూకం వేసి మిల్లుకు పంపిస్తే.. తాలు పేరుతో వెనక్కి పంపేస్తున్నారు'

Mahbubnagar Farmers Problems : ఆరుగాలం శ్రమించి పంట పండించడం కన్నా.. పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకే రైతులు నానా అవస్థలు పడాల్సి వస్తోంది. ఓవైపు అకాల వర్షాల భయం వెంటాడుతుంటే.. తేమ శాతం, నాణ్యత పేరిట కొనుగోలు కేంద్రాల వద్ద పంట అమ్మడం ఆలస్యమవుతోంది. తీరా పంట తూకం వేసి మిల్లర్ల దగ్గరకు పంపాక.. తాలు అధికంగా ఉందంటూ మిల్లర్లు ధాన్యాన్ని తిరిగి పంపుతున్నారు. బస్తాకు ఐదారు కిలోలు తరుగుకు అంగీకరిస్తేనే.. ధాన్యాన్ని దింపుకుంటామంటూ కొర్రీలు పెడుతున్నారు.

farmers
farmers

Mahbubnagar Farmers Problems : ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లాలో రైతులు ధాన్యాన్ని అమ్ముకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు. ఓవైపు అకాల వర్షాల భయం వారిని వెంటాడుతోంది. మరోవైపు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 836 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి.. సుమారు 12 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని పౌర సరఫరాల శాఖ లక్ష్యంగా పెట్టుకున్నా ఇప్పటి వరకూ సగం కొనుగోలు కేంద్రాలు తెరచుకోలేదు.

తెరచుకున్న కేంద్రాల్లోనూ కొనుగోళ్లు సాగడం లేదు. తేమశాతం అధికంగా ఉందని, నాణ్యత ప్రమాణాలకు లోబడి లేదని.. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు తూకాలు వేయడం లేదు. రైతుల ఒత్తిడి మేరకు తూకాలు వేసినా.. మిల్లర్లు ధాన్యాన్ని తీసుకునేందుకు నానా కొర్రీలు పెడుతున్నారు. కొనుగోలు కేంద్రం నుంచి మిల్లుకు పంపిన ధాన్యం నాణ్యంగా లేదని.. తాలు ఉందని ధాన్యాన్ని దింపుకునేందుకు నిరాకరిస్తున్నారు.

నాణ్యంగా లేకుండా తామే తరుగుకు అంగీకరిస్తామని.. అన్ని నాణ్యతా ప్రమాణాలకు లోబడి ధాన్యాన్ని తెచ్చినా ఇదేం దోపిడీ అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో ఎవరికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.

జోగులాంబ గద్వాల జిల్లాలో 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని.. అధికారులు అంచనా వేశారు. కానీ చాలాచోట్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలేదు. ప్రారంభమైన చోట.. తూకాలు సాగడం లేదు. తూకాలైన ధాన్యాన్ని సైతం మిల్లర్లు తీసుకునేందుకు నిరాకరించడంతో.. ఆ బస్తాలు కొనుగోలు కేంద్రాల్లోనే మూలుగుతున్నాయి.

మిల్లర్లంతా కుమ్మక్కై తాలు అధికంగా ఉందన్న సాకుతో ధాన్యాన్ని తీసుకునేందుకు ముఖం చాటేస్తున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా నందివడ్డేమాన్​లో ఇద్దరు రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రం వద్ద అమ్మారు. తూకాలు ముగిశాయి. మిల్లర్లు వచ్చి నాణ్యత చూసి ధాన్యం వద్దంటూ నిరాకరించారు. దీంతో ధాన్యం తిరిగి తీసుకువెళ్లాల్సిందిగా కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు తిరిగి రైతులకు సమాచారం ఇచ్చారు. తాలు పేరుతో ఇంతటి దోపిడీ గతంలో ఎప్పుడూ చూడలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తాలు పేరిట కోతలపై మిల్లర్లను వివరణ కోరగా.. వానలు పడితే పంట చేతికి రాదన్న భయంతో పంట పరిపక్వతకు రాకముందే పంటను కోస్తున్నారని, దీనివల్ల ధాన్యంలో తాలు అధికంగా ఉంటోందని మిల్లర్లు అంటున్నారు. తాలు అధికంగా ఉన్నప్పుడు బస్తా నిండినా తూకం రాదని చెబుతున్నారు.

దీనిపై పౌర సరఫరాల శాఖ అధికారుల వివరణ కోరగా.. తాలు పేరిట మిల్లర్లు ధాన్యాన్ని దింపుకునేందుకు నిరాకరిస్తే.. నాణ్యతను తనిఖీ చేసేందుకు ప్రత్యేక బృందాలను పంపుతున్నామని చెబుతున్నారు. రైతులు తాలు లేకుండా తూర్పార పట్టి, నిర్ణీత తేమశాతం ఉండేలా ధాన్యాన్ని తీసుకురావాలని కోరుతున్నారు.

వాస్తవానికి రైతు ధాన్యం నాణ్యతను వ్యవసాయశాఖ అధికారులు, కేంద్రాల నిర్వాహకులు ముందే చూసి.. ఆ తర్వాతే తూకాలు వేయాలి. కొనుగోలు చేయాలి. ఆ ధాన్యాన్ని మిల్లర్లు తప్పకుండా దింపుకోవాలి. కానీ కొనుగోలు కేంద్రాల వద్ద నాణ్యతను చూడకుండానే తూకాలు వేసి.. లారీల్లో ఎక్కించి రైతులను మిల్లుల వద్దకు పంపుతున్నారు. దీంతో మిల్లర్లు ధాన్యాన్ని దింపు కోవడం లేదు. అన్నిశాఖల మధ్య సమన్వయ లోపం కారణంగా.. చివరకు రైతులే నష్టపోవాల్సి వస్తోంది.

"ధాన్యంలో తాలు ఉందని మిల్లర్లు.. తూకం వేసిన తర్వాత వెనక్కి పంపుతున్నారు. ఒకవేళ బస్తాకు రెండు నుంచి మూడు కిలోల తరుగుకు ఒప్పుకుంటే ధాన్యాన్ని మిల్లులో దించుకుంటున్నారు. మేము అన్ని ప్రమాణాలను పాటించి ధాన్యాన్ని ఐకేపీ కేంద్రాలకు తెస్తున్నాం." - రైతు

తాలు పేరుతో.. రైతులకు మిల్లర్ల వాతలు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details