మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద సాగునీరు అందుతుందని ఆశతో ఆరుతడి పంటలు సహా వరిసాగు చేసిన రైతులు ప్రస్తుతం నీళ్లులేక అల్లాడుతున్నారు. మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద నాగర్ కర్నూల్, వనపర్తి, మహబూబ్ నగర్ జిల్లాలోని 22మండలాల్లో సుమారు రెండున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. యాసంగిలో ఆయకట్టు కింద రైతులు వరి, మొక్కజొన్న, వేరుశనగ, మినుము, మిరప సహా వివిధరకాల పంటలు సాగుచేశారు. మొక్కజొన్న శాఖీయ దశ నుంచి పూతదశ, వరి పిలక ఏర్పడే దశ, వేరుశనగ పూత నుంచి ఊడలు దిగే దశలో ఉంది. ఈ దశల్లో నీరందడం చాలాముఖ్యం.
ఈ దశలో ఎండిపోతే...
ఉష్ణోగ్రతలు సైతం పెరగడంతో ఎప్పటికప్పుడు నీరందించాల్సి ఉంది. ఈ దశలో ఎండిపోతే పంటల్ని వదులుకోవాల్సిందే. ఎలాగోలా కాపాడుకున్నా, ఆశించిన దిగుబడి సాధించడం కష్టమే. అలాంటి కీలక దశలో సాగునీరు అందకపోతే తీవ్రంగా నష్టపోతామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యాసంగిలో వరి వద్దనడంతో చాలామంది రైతులు మొక్కజొన్న, వేరుశనగ, మిరప పంటల వైపు మొగ్గుచూపారు. కొందరు సొంతభూముల్లో, ఇంకొందరు కౌలుకు తీసుకుని పంటల్నిసాగు చేశారు. వేలల్లో పెట్టుబడులు పెట్టారు. మార్చి చివరి వరకూ నీరందితే పంటలు చేతికొచ్చేవి. కానీ ఫిబ్రవరి నుంచి కాల్వలకు నీటివిడుదల నిలిచిపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు.
నీళ్ల కోసం రూ.5 వేల వరకు ఖర్చు
బోరుబావులు, బావులు, ఇతర నీటి వనరులపై ఆధారపడి కొందరు వరివేశారు. మరికొందరు కేఎల్ఐ నీటినే నమ్ముకుని వరిసాగు చేశారు. అలాంటి రైతుల పరిస్థితి ప్రస్తుతం అగమ్యగోచరంగా మారింది. పెట్టిన పెట్టుబడులు సైతం చేతికొచ్చే పరిస్థితి కనిపించడం లేదు. పంటల్ని బతికించేందుకు బోరుబావుల్ని అద్దెకు తీసుకుని మరీ నీరందించే ప్రయత్నం చేస్తున్నారు. ఎకరానికి రూ.5 వేల వరకు నీళ్ల కోసం ఖర్చు చేస్తున్నారు. యాసంగిలో కేఎల్ఐ ఆయకట్టుకు ఆరుతడి పంటలకు 2లక్షల 35వేల ఎకరాలకు వారాబందీ పద్ధతిలో 100రోజుల పాటు సాగునీరు అందిస్తామని డిసెంబర్ 31న పెబ్బేరులో జరిగిన ఉమ్మడి పాలమూరు జిల్లా సాగునీటి సలహామండలి సమావేశంలో అధికారులు నిర్ణయించారు.