తెలంగాణ

telangana

ETV Bharat / state

మాస్క్ ఎందుకు పెట్టుకోలేదంటే... వింత వింత సమాధానాలు - Corona news

కొవిడ్ నిబంధనల అమలులో నిర్లక్ష్యమే జనం కొంప ముంచుతోంది. జనసమ్మర్థం అధికంగా ఉన్న ప్రాంతాల్లోనే వైరస్ వ్యాప్తికి అవకాశం ఎక్కువ. అలాంటి ప్రాంతాల్లో కనీస నిబంధనలు పాటించకపోవడమే.. కేసుల పెరుగుదలకు కారణమవుతోంది. ముఖ్యంగా రైతుబజార్లు, మాంసం, చేపల మార్కెట్లు, కిరాణా, వ్యాపార సముదాయాల వద్ద దుకాణ దారులు, వినియోగ దారులు కనీస జాగ్రత్తలు తీసుకోవడం లేదు. మాస్కులు ఎందుకు ధరించడం లేదని ప్రశ్నిస్తే... జనమిచ్చే వింత సమాధానాలు కరోనా పట్ల నిర్లక్ష ధోరణికి అద్దం పడుతోంది. మహబూబ్​నగర్ జిల్లా కేంద్రంలో రైతుబజార్లు, మాంసం, చేపల మార్కెట్లు, పండ్ల మార్కెట్ వద్ద పరిస్థితిపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.

Not wearing a mask
మాస్క్ వార్తలు

By

Published : Apr 19, 2021, 7:55 PM IST

మాస్క్ ఎందుకు పెట్టుకోలేదంటే...

రైతు బజార్లు, మాంసం, చేపల మార్కెట్లు, పండ్ల, కిరాణా దుకాణాలు.. నిత్యం వందలాది మందితో కిక్కిరిసిపోయే కూడళ్లివి. పల్లెల నుంచి రైతుబజార్లకొచ్చి కూరగాయలు అమ్ముతారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే పండ్లవ్యాపారులు.. పండ్లు విక్రయిస్తారు. మాంసం, చేపల దుకాణాలకు జనం పోటెత్తుతారు. కరోనా కోరలు చాస్తున్న వేళ జనం అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన ప్రాంతాలివి.

వింతవింత సమాధానాలు...

కానీ మహబూబ్​నగర్ జిల్లా కేంద్రంలోని రైతుబజార్, పంట్ల మార్కెట్, మాంసం దుకాణాలు, కిరాణా దుకాణాల్లో కొవిడ్ నిబంధనలు అమలు కావడం లేదు. ఎవరి ఇష్టానుసారం వాళ్లు వ్యవహరిస్తున్నారు. కరోనా బారిన పడతామన్న భయం ప్రజల్లో కనిపించడం లేదు. జనసమ్మర్థం అధికంగా ఉండే ప్రాంతాలకు తప్పనిసరై వెళ్తున్నప్పుడు మాస్క్ ధరించాలి.

వీలైనంత వరకూ భౌతిక దూరం పాటించాలి. సబ్బు, నీళ్లు ఎక్కడంటే అక్కడ దొరకవు కాబట్టి శానిటైజర్లు సైతం అందుబాటులో ఉంచుకోవాలి. మాస్కు ఎందుకు ధరించ లేదంటే వారు చెప్పే మాటలు అంతుబట్టడం లేదు. ఒకరు వేడిగా ఉందని... ఇంకొకరు తింటున్నానని... మరొకరు గిరాకీ లేదని ఇలా సమాధాలు చెబుతున్నారు.

మాస్క్ లేని దుకాణదారులు...

రైతు బజార్లలో కూరగాయలు విక్రయించే రైతులు, వ్యాపారులు, మాంసం, చేపల విక్రయదారులు సైతం నిబంధనలు పాటించడం లేదు. మాస్కులు లేని వినియోగదారులకు సేవల్ని అందించకుండా ఉండాల్సింది పోయే దుకాణ యజమానులే మాస్కులు ధరించడం లేదు.

కొన్ని దుకాణాల్లో కనీసం శానిటైజర్ కూడా అందుబాటులో లేదు. స్థలాభావంతో భౌతికదూరం సైతం పాటించడం లేదు. దుకాణాలే పక్కపక్కన ఉండటంతో వినియోగదారులు కూడా భౌతిక దూరాన్ని పాటించలేని దుస్థితి. మాస్కులు ఎందుకు ధరించడం లేదంటే దుకాణ దారులు ఇచ్చే సమాధానాలు వింతవింతగా ఉంటున్నాయి.

ఇష్టానుసారం...

లాక్​డౌన్​లో కూరగాయల కోసం జనం ఒక దగ్గరకి రాకూడదన్న ఉద్దేశంతో దాదాపు అన్ని పట్టణాల్లో ఐదారు చోట్ల కూరగాయలు, పండ్ల మార్కెట్లను ఏర్పాటు చేశారు. దుకాణాల వద్ద భౌతిక దూరం పాటించేలా వాటి ముందు సర్కిళ్లు గీశారు. మాస్కు లేనిదే సేవలు లేవనే బోర్డులు తగిలించారు.

ఇప్పడు అవేవి అమల్లో లేకపోవడం వల్ల జనం ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా పురపాలిక, మార్కెటింగ్ శాఖ అధికారులు రంగంలోకి దిగి కోవిడ్ నిబంధనలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఇదీ చూడండి:తెలంగాణపై కొవిడ్ పంజా.. 39,154 యాక్టివ్ కేసులు

ABOUT THE AUTHOR

...view details