మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రస్తుతం ఇంటరు, ఆ పై కోర్సులు చదువుతున్న బధిర విద్యార్థులు, యువకులకు ఉచితంగా 4జీ స్మార్ట్‌ఫోన్లను రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయనుంది. గతంలో డిగ్రీ చదివే విద్యార్థులకు మాత్రమే ఇచ్చేవారు. ప్రస్తుతం ఆ నిబంధన సడలించారు. ఇంటరు, ఆ పై చదువులు చదివిన విద్యార్థులు, యువకులను అర్హతగా ప్రకటించింది. గతేడాది నుంచి ఈ కార్యక్రమం అమలవుతున్నా ఈ సంవత్సరం అర్హతలను సడలించి ఎక్కువ మంది బధిరులకు అందించేలా నిర్ణయం తీసుకుంది. బధిరులు వీటి ఆధారంగా అన్ని అవసరాలను తీర్చుకోవాలన్న ఉద్దేశంతో వీటిని రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ ద్వారా అందిస్తున్నారు.
వికలాంగుల కార్పొరేషన్
ఉమ్మడి పాలమూరు జిల్లాకు ప్రభుత్వం రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ ద్వారా 67 స్మార్ట్ చరవాణులను మంజూరు చేసింది. ఇందులో నాగర్‌కర్నూల్ జిల్లాకు 10 చరవాణులు, వనపర్తి జిల్లాకు 10, మహబూబ్‌నగర్‌కు 29, గద్వాలకు 10, నారాయణపేట జిల్లాకు 8 చొప్పున 4 జీ స్మార్ట్ చరవాణులు మంజూరయ్యాయి. ప్రస్తుతం ఇంటర్, ఆపై కోర్సులు చదువుతున్న బధిర విద్యార్థులు, యువకులు వీటికి అర్హులు.