మహిళలు స్వయం ఉపాధి పొందేందుకు స్త్రీనిధి మంచి బాటలు వేస్తోందని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటరావు అన్నారు. మహబూబ్‌నగర్ సమీపంలోని బండమీదిపల్లి టీటీడీసీలో నిర్వహించిన స్త్రీనిధి సమీక్ష సమావేశంలో కలెక్టర్ పాల్గొన్నారు.
మహిళలు తీసుకున్న రుణాలను సకాలంలో తిరిగి చెల్లించాలని.. ముఖ్యంగా మొండి బకాయిలు లేకుండా చూసుకోవాలని మహబూబ్‌నగర్ కలెక్టర్ వెంకటరావు జిల్లా మహిళా సమాఖ్య సభ్యులకు సూచించారు. ఆదాయం పెంపొందించే విధంగా ప్రతి మండలంలో కనీసం మూడు పెద్ద కార్యక్రమాలను చేపట్టాలని కలెక్టర్ సూచించారు.
మహిళల స్వయం ఉపాధికి స్త్రీనిధి మంచి బాటలు: కలెక్టర్ కొన్ని రాష్ట్రాలలో మళ్లి కొవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా రెండో విడత కరోనా వైరస్ విజృంభించే అవకాశం ఉందన్న వైద్య నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో గ్రామాల్లో కరోనాపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని మహిళా సంఘాల సభ్యులను ఆదేశించారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరు మాస్కు ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం, చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవటంతో పాటు శానిటైజ్ చేసుకోవడం వంటివి తప్పనిసరిగా పాటించేలా అవగాహన కల్పించాలని ఆదేశించారు.
అనంతరం "ఉన్నతి" కార్యక్రమం ద్వారా స్వయం ఉపాధి శిక్షణ పొందుతున్న మహిళ అభ్యర్థుల కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. నిరుద్యోగ యువతులు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని.. ఆ లక్ష్యాన్ని సాధించేందుకు కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని.. ఆ లక్ష్యాన్ని సాధించేందుకు కావలసిన ప్రణాళికను రూపొందించుకుని ముందుకు వెళ్లాలని పేర్కొన్నారు. ఉన్నతి కార్యక్రమం కింద శిక్షణ పొందిన యువతులందరికి ఆయా కంపెనీలలో ఉద్యోగావకాశాలు కల్పిస్తామని కలెక్టర్ భరోసానిచ్చారు.