ప్ర- ప్రస్తుతం మహబూబ్ నగర్ జిల్లాలో కోవిడ్ తీవ్రత ఎలా ఉంది ?
స: గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది కేసుల తీవ్రత అధికంగా ఉంది. అలాగని ఇతర రాష్ట్రాల్లో ఉన్నంత అధికంగా లేదు. అయితే ప్రజలు కనీస నిబంధనలు పాటించడంలో నిర్లక్ష్యం చేసున్న కారణంగా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. గతంలో ఒక కుటుంబంలో ఒకరికొస్తే మిగిలిన వాళ్లంతా దూరంగా ఉండి జాగ్రత్తలు పాటించే వాళ్లు. కేసులు తక్కువగా నమోదయ్యేవి. ప్రస్తుతం కుటుంబంలో ఒకరికి వస్తే సరైన జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల పరీక్షలు నిర్వహిస్తే కుటుంబంలో ఎక్కువ మందికి పాజిటివ్ లు వస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన సమయమిది. జిల్లాలో ప్రస్తుతం 4584 క్రీయాశీల కేసులున్నాయి. ఇప్పటి వరకూ 127 మరణాలు సంభవించాయి.
ప్ర- కొవిడ్ నియంత్రణ కోసం మహబూబ్ నగర్ జిల్లాలో ప్రత్యేకంగా ఏం చర్యలు తీసుకుంటున్నారు.
స: వ్యాధి రాకుండా అడ్డుకోవాలంటే స్వీయ నియంత్రణే మొదటి ఆయుధం. పౌరులు దీన్ని గ్రహించాలి. యంత్రాంగం తరపున మున్సిపాలిటీలు, పట్టణాల్లో వేర్వేరుగా 18 టాస్క్ ఫోర్స్ బృందాలను మోహరించాం. మున్సిపల్, పంచాయతీ రాజ్, పోలీసు, రెవిన్యూ శాఖలకు చెందిన సభ్యులు ఇందులో ఉంటారు. పల్లెపట్టణాల్లో కోవిడ్ నిబంధనల అమలు సహా కర్ఫ్యూను ఈ బృందాలు పర్యవేక్షిస్తాయి. నిబంధనలు పాటించని వారిని మొదట హెచ్చరిస్తారు. ఫలితం కనిపించకపోక పోతే అపరాధ రుసుములు విధిస్తారు. మార్పు లేకపోతే మరింత కఠినంగా వ్యవహరిస్తారు. మాస్కు ధరించని వారిపై ఇప్పటి వరకూ 3423 కేసులు నమోదు చేశారు.
ప్ర- ప్రాథమిక సంబంధీకులను గుర్తించే పని ప్రభావవంతంగా జరుగుతోందా?
స: గతంలో పోలీసులు ప్రైమరీ కాంటాక్టులను గుర్తించడంలో సహాకరించేవాళ్లు. ప్రస్తుతం వైద్యారోగ్యశాఖ సహా కలెక్టరేట్ కంట్రోల్ రూం నుంచి నిరంతర పర్యవేక్షణ చేస్తున్నాం. పాజిటివ్ వచ్చిన వారి నుంచి సమాచారం తీసుకుని వారి ప్రాథమిక సంబంధీకులను కూడా హోం ఐసోలేషన్ లో ఉంచుతున్నాం. గ్రామస్థాయిలో ఈ ప్రక్రియ పకడ్బందీగా కొనసాగుతోంది.
ప్ర- లక్షణాలున్నా ఎక్కువమంది పరీక్షలు చేయించుకోవడం లేదు. పరీక్షలు చేయించుకునేలా ప్రోత్సహిస్తున్నారా?
జలుబు, జ్వరం లాంటివి తేలిగ్గా తీసుకుంటున్నారు. లక్షణాలున్న వాళ్లు వెంటనే పరీక్షలు చేయించుకోవాలి. అందుకు గ్రామస్థాయిలో ఆశా, ఎఎన్ఎం బృందాలు అవగాహన కల్పిస్తున్నారు. పరీక్షల విషయంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్థాయిలో లక్ష్యాలు నిర్ణయించాం. లక్ష్యానికి మించి పరీక్షలు జరుగుతున్నాయి. జిల్లాలో 22417 ఆర్టీపీసీఆర్, 2,33,239 రాపిడ్ యాంటిజెన్ పరీక్షలు నిర్వహించాం. పరీక్షలు విస్తృతంగా జరుగుతున్నాయి. అందుకే కేసులు ఎక్కువగా గుర్తించగలుగుతున్నాం.
ప్ర- పరీక్షలకు ఆసుపత్రులకు రాలేని వాళ్ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయా?
స: మంత్రి శ్రీనివాస్ గౌడ్ సూచనల మేరకు జిల్లాలో 3 ప్రత్యేక సంచార వైద్య సేవల వాహనాలను ప్రారంభించాం. కోవిడ్ పరీక్షలు, వ్యాధి నిర్ధారణ, చికిత్స మూడింటికీ సంబంధించిన సేవలు ఒకే అంబులెన్స్ లో ఉంటాయి. ఆసుపత్రులకు రాలేని వాళ్లు కంట్రోల్ రూం నంబర్ కు ఫోన్ చేస్తే అంబులెన్స్ లు ఇంటికే వస్తాయి. పరీక్షలు చేసి వ్యాధి నిర్ధరణ అయితే అక్కడే మందులిచ్చి హోం ఐసోలేషన్ చేస్తారు. వ్యాధి తీవ్రత అధికంగా ఉంటే వెంటనే ఆసుపత్రికి అదే అంబులెన్స్ లో తరలిస్తారు. ఈ సేవల్ని ప్రజలు వినియోగించుకోవచ్చు. కంట్రోల్ రూం నెంబర్ 08542-241165
ప్ర- కోవిడ్ రోగులు 14రోజుల స్వీయ నిర్బంధాన్ని పాటించడం లేదు. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
స: ఉపాధి కోసం, ఉద్యోగం కోసం 14రోజులు పాటించకుండా లక్షణాలు తగ్గగానే స్వీయ నిర్బంధం నుంచి బైటకు వస్తున్నారు. అందుకే 100కు పైగా కార్మికులున్న పరిశ్రమలకు దీనిపై ప్రత్యేకంగా అవగాహన కల్పించాం. 14 రోజుల వరకూ కోవిడ్ బారిన పడిన వారిని విధుల్లోకి పిలవద్దని చెప్పాం. గ్రామస్థాయిలో కూడా కొందరు పాటించడం లేదు. పడక్బందీ అమలయ్యేలా చర్యలు తీసుకుంటాం.