మహబూబ్‌నగర్ జిల్లాలో వారం రోజుల పాటు 440 గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ ఎస్.వెంకటరావు ఆదేశించారు. ఈ నెల 18 నుంచి 24 వరకు చేపట్టాల్సిన పనులపై సర్పంచులు, మండల ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులు, అదనపు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. అక్టోబర్‌లో కురిసిన భారీ వర్షాలను దృష్టిలో ఉంచుకొని అంటువ్యాధులు ప్రబలకుండా రహదారులు, మురికి కాల్వలను ఈ వారం రోజుల పాటు నిర్వహించే ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో శుభ్రం చేయించాలని ఆదేశించారు.
అన్నీ శుభ్రం
వీధులను శుభ్రం చేయడం, పిచ్చి మొక్కలను తొలగించడం, అంతర్గత రహదారులపై ఏర్పడిన గుంతలను పూడ్చడం, ఇళ్ల నుంచి తడి, పొడి చెత్తను సేకరించి డంపింగ్ యార్డ్‌కు తరలించడం.. ప్లాస్టిక్ బ్యాగులను, ఈ- వ్యర్థాలను తొలగించడం వంటి కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలను శుభ్రం చేసి ఈ ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.
పనుల్లో వేగం అవసరం
సాగునీటి ప్రాజెక్టులు, జాతీయ రహదారి విస్తరణ, రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న భూసేకరణ పనులను వేగవంతం చేయాలని ఆయన ఆదేశించారు. జాతీయ రహదారి విస్తరణ కార్యక్రమాల్లో పనుల పురోగతి తక్కువగా ఉందని, వేగం పెంచాలని సూచించారు. పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద ఉదండాపూర్, కరివేన రిజర్వాయర్‌ల పరిధిలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. భూసేకరణకు సంబంధించి ఎక్కడైనా నష్ట పరిహారం చెల్లించాల్సి ఉంటే తక్షణమే అందజేయాల్సిందిగా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
పచ్చదనం పెంచాలి
మహబూబ్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. కళాభవన్, కూరగాయల మార్కెట్, రహదారుల విస్తరణ, హరితహారం, రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణం తదితర అంశాలపై చర్చించారు. పాలమూరు విశ్వవిద్యాలయంలో నర్సరీ ఏర్పాటు చేయాలని, రెండు లక్షల టేకు మొక్కలతో పాటు.. 50వేల పండ్ల, ఔషధ మొక్కలను పెంచేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. స్వచ్ఛ సర్వేక్షన్, చెత్తను వేరు చేసే షెడ్లు, రోడ్లు-భవనాల శాఖ ద్వారా చేపట్టిన నిర్మాణాలు, విద్యుత్ శాఖ ద్వారా చేపట్టిన పనులు తదితర అంశాలను కలెక్టర్ సమీక్షించారు.
ఇదీ చదవండి:తేమ శాతం లేదంటూ ధాన్యం తిరస్కరణ.. రైతుల ధర్నా