మహబూబ్నగర్ కెనాల్ పనుల్లో జాప్యం.. సహకరించని రైతులు Mahabubnagar canal works delayed: మహాత్మగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పరిధిలోని సింగోటం జలాశయం, జూరాల ఎడమ కాల్వ పరిధిలోని గోపాల్ దిన్నె జలాశయం ఈ రెండు జలాశయాల్ని కలిపే లింక్ కెనాల్ పనుల్లో జాప్యం రైతుల పాలిట శాపంగా మారుతోంది. భూసేకరణ ఆలస్యం కావడంతో కాల్వపనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారాయి. వచ్చే వానాకాలంలోనూ లక్షిత ఆయకట్టుకు నీరందే పరిస్థితి లేదు. కొల్లాపూర్ నియోజక వర్గంలోని వీపనగండ్ల, చిన్నంబావి, పానగల్, కోడెరు, కొల్లాపూర్ మండలాల్లో జూరాల చివరి ఆయకట్టు 27వేల ఎకరాలు, భీమా ఆయకట్టు 9వేల ఎకరాలు మొత్తం 35వేల ఎకరాలకు 20 ఏళ్లుగా సాగునీరు అందడం లేదు.
కేఎల్ఐ పరిధిలోని సింగోటం జలాశయం నుంచి జూరాల పరిధిలోని గోపాల్ దిన్నె జలాశయాన్ని నింపడం ద్వారా దిగువన ఉన్న నీరందని 35వేల ఎకరాలకు సాగునీరు అందించాలన్న లక్ష్యంతో లింక్ కెనాల్ పనులకు రూపకల్పన చేశారు. 147కోట్లతో పనుల్ని చేపట్టగా ఇప్పటి వరకూ 10శాతం పనులు కూడా పూర్తి కాలేదు. భూసేకరణ అందుకు ప్రధాన సమస్యగా మారింది. ఎకరా 15 నుంచి 20 లక్షలు పలుకుతున్న పొలాల్ని ప్రభుత్వం 5లక్షల 80వేల పరిహారం చెల్లించి సేకరించడంపై రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
"సింగోటం రిజర్వాయర్ నుంచి గోపాల్పేట రిజర్వాయర్ వరకు 6 గ్రామాల రైతులు భూములు పోతున్నాయి. ఆ భూముల్లో సర్వే ఇంకా పూర్తి చేయలేదు. 10కిలోమీటర్ల మేర కాలువ పోతుంది. ఎంత నష్టపరిహారం ఇస్తామని కూడా చర్చలేదు. అవార్డు ప్రకటించలేదు కానీ బొల్లారం దగ్గర పనులు ప్రారంభం చేశారు. అక్కడ రైతులు అడ్డుకున్నారు. మేము పనులు చేయనివ్వము. మార్కెట్ ధర కంటే 4రెట్లు ఎక్కువ ఇవ్వాలి"_రాంచంద్రయ్య గౌడ్, సంగినేని పల్లి
మూడింతల పరిహారం చెల్లించాలి: లింక్ కెనాల్ పొడవు 22 కిలోమీటర్లు కాగా ఇప్పటి వరకూ ప్రభుత్వ భూములున్న చోట మాత్రమే కాల్వల్ని తవ్వి వదిలేశారు. అలా సుమారు 5 కిలోమీటర్ల కాల్వల్ని మాత్రమే తవ్వారు. మిగిలిన చోట్ల రైతులు భూసేకరణ సర్వేను అడ్డుకుంటున్నారు. నాగర్ కర్నూల్ జిల్లాలోని సింగోటం, నర్సాయిపల్లి, వనపర్తి జిల్లాలోని కొర్లకుంట, బొల్లారం, వల్లభాపురం, సంగినేనిపల్లి, కర్వరాల గ్రామాల్లో సుమారు 360 ఎకరాలు కాల్వ కోసం సేకరించాల్సి ఉంది. కాగా 2 పంటలు పండే తరిపొలాల్ని ప్రభుత్వమిచ్చే ఐదున్నర- ఆరు లక్షలకు వదులుకోబోమని రైతులు తేగేసి చెబుతున్నారు. అప్పట్లో ఈ విషయాన్ని కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి దృష్టికి సైతం తీసుకువెళ్లారు. తగిన పరిహారం అందేలా కృషి చేస్తానని చెప్పినా ఇప్పటి వరకూ ఆ దిశగా చర్యలు లేవని రైతులు వాపోతున్నారు. ప్రస్తుతమున్న బహిరంగ మార్కెట్ ధరకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం మూడింతల పరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
10శాతం పనులు పూర్తి: కాల్వలో భూములు కోల్పోతున్న వాళ్లంతా చిన్నసన్నకారు రైతులేనని, జీవనాధారమైన భూమి ప్రభుత్వం తీసుకుంటే తామెలా బతకాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరైన పరిహారం అందిస్తే భూములిచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని, ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వచ్చే జూన్ నాటికే పనులు పూర్తి కావాల్సి ఉండగా.. ప్రస్తుతానికి 10శాతం వరకూ పనులు పూర్తైనట్లు నీటి పారుదలశాఖ ఈఈ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. సుమారు 10కోట్ల విలువైన పనులు అయ్యాయని, భూసేకరణలో జాప్యం కారణంగా పనులు ఆలస్యమవుతున్నట్లుగా తెలిపారు.
ఎదురౌతున్న సాంకేతిక సమస్యలు: సింగోటం జలాశయం దిగువన పనులు చేపట్టడానికి ఆయకట్టు రైతులు అభ్యంతరం చెప్పడంతో సొరంగ మార్గంలో కాల్వ పనులు చేపట్టానికి అధికారులు చర్యలు చేపట్టారు. పాత అలైన్మెంట్లో లేని సొరంగ మార్గం పనులు తెరపైకి రావడంతో పనులు చేపట్టాల్సిన గుత్తేదారుకు సైతం సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నట్లుగా తెలుస్తోంది. సాంకేతిక, భూసేకరమ సమస్యలపై ఇప్పటికైనా నీటి పారుదల శాఖ, రెవిన్యూ అధికారులు సహా ప్రజాప్రతినిధులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. పరిహారం సంగతి తేల్చితే పనులు వేగం పుంజుకునే అవకాశం ఉంది. లేదంటే ఈ వానాకాలం కూడా లక్షిత ఆయకట్టు నీరందే పరిస్థితి ఉండదు.
ఇవీ చదవండి: