Mahabubnagar BRS Leaders Joining in Congress : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో గడిచిన పదేళ్లలో బీఆర్ఎస్లో కీలక భూమిక పోషించి, ఈ ఎన్నికల్లో టిక్కెట్టు ఆశించి భంగపడ్డ నేతలంతా ప్రస్తుతం ఒక్కొక్కరుగా కాంగ్రెస్ బాట పడుతున్నారు. టిక్కెట్టు దక్కించుకోవడమే లక్ష్యంగా తమ అనుచరులు, అసంతృప్తులతోహస్తం పార్టీలో చేరుతున్నారు. తాజాగా ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధుల ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డితో పాటు నాగర్ కర్నూల్ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బాలాజీ సింగ్, రంగారెడ్డి జిల్లా కడ్తాల్ ఎంపీపీ కమ్లి మోత్యానాయక్, ఆమనగల్ ఎంపీపీ అనిత విజయ్, మరో 70మంది దిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు.
BRS Leaders Joining in Congress Telangana :అచ్చంపేట నియోజక వర్గంలోనూ ఇద్దరు జడ్పీటీసీలు, ఓ ఎంపీపీ సహా పలువురు స్థానిక ప్రజాప్రతినుధులు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. బీఆర్ఎస్లో టిక్కెట్టు ఆశించి భంగపడ్డ నేతలతో పాటు, మంత్రులు, శాసనసభ్యుల నుంచి పదవులు, పనులు ఆశించి భంగపడ్డ స్థానిక నాయకులు, రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థమైన వాళ్లు, భవిష్యత్తు కాంగ్రెస్‌దే అని నమ్మే కార్యకర్తలు ఒక్కొక్కరుగా హస్తం పార్టీ వైపు అడుగులు వేస్తున్నారు.
Telangana Congress Joinings 2023 : ఉమ్మడి పాలమూరు జిల్లాలో నియోజక వర్గాల వారీగా గమనిస్తే కొల్లాపూర్ నియోజక వర్గం నుంచి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, నాగర్ కర్నూల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, గద్వాల నియోజక వర్గం నుంచి జడ్పీ ఛైర్పర్సన్ సరిత, వనపర్తి నియోజక వర్గం నుంచి మంత్రి నిరంజన్ రెడ్డికి ప్రధాన అనుచరునిగా ఉన్న పెద్దమందడి ఎంపీపీ మేఘారెడ్డి, కొడంగల్ నియోజక వర్గంలో మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి ఇలా కీలకమైన నేతలంతా కాంగ్రెస్‌లో చేరారు. క్షేత్రస్థాయిలో బలమైన నాయకులు, ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ను వీడటం గులాబీ దళానికి కాస్త మింగుడుపడని అంశమే. వచ్చే ఎన్నికల్లో ఓట్లపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
అధికార పార్టీ మాత్రమే కాదు.. బీజేపీ సహా ఇతర పార్టీల నుంచి కూడా హస్తం పార్టీకి వరుస కడుతున్నారు. మహబూబ్‌నగర్ నియోజక వర్గంలో బీజేపీలో కీలక నేతగా ఉన్న మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సైతం ఇటీవలే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ప్రముఖ న్యాయవాది, బీసీ నాయకుడు వెంకటేష్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. దేవరకద్ర, మక్తల్ నియోజక వర్గాల్లో తమకంటూ ప్రత్యేకమైన అనుచరగణం ఉన్న తెలుగుదేశం నేత, మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి సతీమణి సీతాదయాకర్ రెడ్డి సైతం తమ రాజకీయ భవిష్యత్తు కోసం హస్తంపార్టీ వైపే మొగ్గుచూపారు.