తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా కట్టడికి ఫలిస్తున్న అధికారుల చర్యలు

అందుబాటులో కూరగాయలు, పండ్లు, నిత్యావసరాలు. సమస్యలు విన్నవించుకునేందుకు కమాండ్ కంట్రోల్ రూం... వైద్య సహాయం, మందుల కోసం టెలిమెడిసిన్ సేవలు, కంటైన్​మెంట్ జోన్లలో సంచార వాహనాలతో ఇళ్ల వద్దకే వసతులు. కట్టుదిట్టమైన నిఘా. వైరస్ నియంత్రణ కోసం నిరంతర చర్యలు. లాక్​డౌన్​లో జనం ఇబ్బంది పడకుండా.. కరోనా వ్యాప్తి చెందకుండా మహబూబ్​నగర్ జిల్లా యంత్రాంగం తీసుకుంటున్న చర్యలవి. ఫలితంగా ఐదారు రోజులుగా జిల్లాలో కొత్త పాజిటివ్ కేసులు నమోదు కాలేదు.

Mahabubanagar officers fight against corona virus
కరోనా కట్టడికి ఫలిస్తున్న అధికారుల చర్యలు

By

Published : Apr 20, 2020, 8:54 AM IST

కరోనా వైరస్ నియంత్రణలో అహర్నిశలు శ్రమిస్తున్న మహబూబ్​నగర్ జిల్లా అధికార యంత్రాంగం... లాక్​డౌన్​లో జనం ఇబ్బంది పడకుండా టెలి విధానాలను అనుసరిస్తోంది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం కమాండ్ కంట్రోల్ రూం, వైద్య సేవలు మందుల కోసం టెలి మెడిసిన్ లాంటి కార్యక్రమాలను చేపట్టింది. తాజాగా శనివారం నుంచి ఎం3 ఫ్రెష్ పేరుతో కంటైన్​మెంట్ జోన్లలో టెలి బుకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. మహబూబ్ నగర్ జిల్లా యంత్రాంగం, మెప్మా, ఎంసీఆర్​హెచ్​ఆర్​డీఐ ఆధ్వర్యంలో ఈ సేవల్ని ప్రారంభించారు. ఉదయం ఆరు గంటల నుంచి 11 గంటల వరకు 08542- 252203 లేదా, 9553050607 నెంబర్లకు కాల్ చేస్తే... ప్రజలకు కావాల్సిన పండ్లు, కూరగాయలు, మాస్కులు, శానిటైజర్లు నేరుగా ఇళ్ల వద్దకే డెలివరీ చేస్తారు.

కంట్రోల్​ రూం ఏర్పాటు..

వైద్యసేవలు, మందుల కోసం 08542-226670 నెంబర్​కు కాల్ చేస్తే టెలి మెడిసిన్ వాహనం ఇళ్ల వద్దకు వచ్చి కావలసిన మందులు, వైద్య సహాయం అందిస్తారు. ప్రభుత్వ యంత్రాంగం నుంచి ఎలాంటి సాయం కావాలన్నా.. లేదా ఏవైనా ఫిర్యాదులు చేయాలన్నా.. 08542- 241165 నెంబర్​కు కాల్ చేయవచ్చు. రైతులు, ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం మహబూబ్‌నగర్‌ వ్యవసాయశాఖ కార్యాలయంలో 7288894333, 7288894390, 7288897898. నెంబర్లతో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు.

కొత్తకేసులు లేవు..

అధికార యంత్రాంగం చేపట్టిన కట్టుదిట్టమైన చర్యల కారణంగా ప్రస్తుతానికి ఐదారు రోజులుగా కొత్త కేసులు నమోదు కావడం లేదు. మహబూబ్​నగర్ జిల్లాలో మొత్తం 11 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8 మంది గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ముగ్గురు కోలుకున్నారు. జిల్లా నుంచి 281 మంది నమూనాలు కరోనా పరీక్షల కోసం పంపగా 272 మందికి కరోనా లేదని తేలింది. విదేశాల నుంచి వచ్చిన 327 మంది ఇప్పటికే హోం క్వారంటైన్ గడువు పూర్తి చేసుకున్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ప్రభుత్వ క్వారంటైన్ లో 12 మంది ఉన్నారు. ఒకరు జనరల్ ఆసుపత్రి ఐసోలేషన్ లో పర్యవేక్షణలో ఉన్నారు. మరో 585 మందిని అధికారులు హోం క్వారంటైన్ లో ఉంచారు.

ఆధునిక సాంకేతికత..

ఉద్యోగులు, సిబ్బందిని ఎప్పటికప్పుడు సమాయత్తం చేసేందుకు సైతం ఆధునిక సాంకేతికను మహబూబ్​నగర్ యంత్రాంగం వినియోగించుకుంటోంది. జిల్లాలోని 18 ప్రాంతాల నుంచి సుమారు 3వేల మందికి కొవిడ్- 19 మార్గదర్శకాలపై ఆన్​లైన్​లో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. వైద్యులు, అంగన్​వాడీలు, ఆశ కార్యకర్తలు, మున్సిపల్, రెవిన్యూ, వైద్యారోగ్యశాఖ సహా ఇతరశాఖల సిబ్బంది ఈ శిక్షణలో ఆన్​లైన్​లో పాల్గొన్నారు. ఎక్కువ మంది సిబ్బందికి ఒకేసారి శిక్షణ అందించేందుకు భవిష్యత్తులోనూ ఆన్​లైన్ విధానాన్ని అనుసరించనున్నారు.

ఇవీ చూడండి: ఎలాంటి సడలింపుల్లేవ్​.. మే 7 వరకు లాక్‌డౌన్‌: కేసీఆర్

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details