MahaBrand Skotch Award: మహబూబ్‌నగర్ జిల్లాలో స్వయం సహాయక బృందాలు పలు వస్తువులను ఉత్పత్తి చేస్తూ అమ్ముతున్నాయి. తద్వారా మహిళా సంఘాల సభ్యులు ఉపాధి పొందే వాళ్లు. ఆ వస్తువులకు మంచి నాణ్యత ఉన్నప్పటికీ ఒక బ్రాండ్ అంటూ లేకపోవడంతో మార్కెటింగ్ అవకాశాలు అంతంతమాత్రంగానే ఉండేవి. ఈ సమస్య అధిగమించేందుకు మహబూబ్‌నగర్ జిల్లా అధికారులు 'మహా బ్రాండ్'ను నెలకొల్పారు. మహిళా సంఘాల ఉత్పత్తులు ఒకే గొడుగు కిందకు తెచ్చి మహా బ్రాండ్ పేరుతో అమ్మకాలు మొదలుపెట్టారు.
తినుబండారాలను 'మహా రుచి', దుస్తులను 'మహా వస్త్ర'.. ఇలా 'మహా స్వర్ణ జూవెల్లరీ', 'మహా హస్తకళ' పేర్లతో ఆయా ఉత్పత్తులు విక్రయిస్తున్నారు. 'మహా స్టోర్ట్స్', 'మహా మొబైల్ వ్యాన్ల' ద్వారా గ్రామాలు, మండలాల్లోనూ అమ్మకాలు జరిపింది. 17 సంఘాలు తయారు చేసే ఉత్పత్తులు సుమారు 20లక్షల అమ్మకాలే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. జిల్లా మహిళా సమాఖ్యతో పాటు 15 మండల మహిళా సమాఖ్యలు, 477 గ్రామైక్య సంఘాలు, 11,243 స్వయం సహాయక సంఘాలు, 1,24,065 మంది సభ్యులున్నారు. వీరిలో 2,200 మందికి వివిధ రకాల ఉత్పత్తుల తయారీలో జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ-డీఆర్డీఏ ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చారు.