పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కర్వెన(కురుమూర్తి జలాశయం) జలాశయాన్ని 13, 14, 15 ప్యాకేజీల్లో భాగంగా నిర్మిస్తున్నారు. ప్యాకేజీ 13లో 4.5 కి.మీ, ప్యాకేజీ 14లో 4.5 కి.మీ నుంచి 7.6 కి.మీ, ప్యాకేజీ 15లో భాగంగా 7.6 కి.మీ నుంచి 14.4 కి.మీ వరకు ప్రధాన కట్టను నిర్మించనున్నారు.
కర్వెన జలాశయం 13వ ప్యాకేజీలో ప్రధాన కట్ట నిర్మాణం చేపడుతున్నారు. ప్రస్తుతం 270 మీటర్ల వెడల్పుతో పనులు జరుగుతున్నాయి. జలాశయం పూర్తిగా మట్టి కట్ట కావడంతో నీటి ఉద్ధృతిని తట్టుకునేలా నిర్మాణం చేపడుతున్నారు. మధ్యలో నల్లమట్టి సహా ఇరువైపులా చివరన రాతితో కట్ట నిర్మాణం చేస్తున్నారు.
జలాశయంలో నీళ్లు నిండుగా ఉన్న సమయంలో కట్ట నీటి ఉద్ధృతిని తట్టుకొనేలా నిర్మాణం చేపడుతున్నారు. నీరు సులభంగా బయటకు వెళ్లేలా ఒండ్రుమట్టి... అనంతరం ఫిల్టర్ బెడ్‌లను ఏర్పాటు చేస్తారు. అవి సరిగ్గా నిర్మించకపోవడంతోనే కట్టపై నిలిచింది. కట్ట పనుల్లో భాగంగా మధ్యలో నల్లమట్టితో నింపాలి. ఈ మట్టి కాస్తా జిగటుగా ఉండటంతో కట్ట మధ్య నుంచి నీరు వెళ్లకుండా అడ్డుకుంటుంది.
నిర్మాణంలో ఉండగానే..
ప్రస్తుతం 22 మీటర్ల వెడల్పున నల్లమట్టితో కట్ట నిర్మాణం చేపట్టారు. రెండు వైపులా మిగిలిన ప్రాంతాన్ని ఒండ్రు మట్టితో నింపుతూ కట్ట ఎత్తును పెంచుతూ వచ్చారు. గత వారం రోజులుగా పడుతున్న వర్షాలకు.. కట్టకు మధ్యలో నల్లమట్టితో నింపిన ప్రాంతం పూర్తిగా కుంగిపోయింది. లోపల నుంచి వరద నీటితో రివిట్మెంట్కు గండిపడింది. దీంతో వరద నీరు మొత్తం దగ్గరలోని పొలాల్లోకి వెళ్లింది. కట్ట నిర్మాణ దశలో ఉండగానే.. గండి పడటంతో పనుల్లో నాణ్యతపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.