బతకలేక బడిపంతులన్నట్లుగా.. ప్రైవేటు టీచర్ల బతుకులు కరోనా మహమ్మారి ప్రభావం చూపని రంగమే లేదు. లాక్‌డౌన్ వల్ల ప్రైవేటు పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు ఉపాధి లేకుండా పోయింది. జులై మాసాంతం వరకూ పాఠశాలలు తెరవకూడదన్న నిబంధనల మేరకు.. ఇప్పటికీ విద్యాసంవత్సరం ప్రారంభం కాలేదు. కొన్ని కార్పొరేటు, ప్రైవేటు పాఠశాలలు ఆన్‌లైన్ తరగతులు ప్రారంభించినా... పట్టణాల్లో, మండల కేంద్రాల్లోని బడ్జెట్ స్కూళ్లు మాత్రం ఎటూ తేల్చుకోలేక పోతున్నాయి.
ఆయా పాఠశాలల్లో పని చేసే ప్రైవేటు ఉపాధ్యాయులు ఉపాధి కోల్పోతున్నారు. ఇప్పటికే మార్చి నుంచి వారికి జీతాలు లేవు. ఆగస్టు వరకూ బళ్లు తెరచుకోవు. వచ్చేదే చాలీచాలని జీతం. ఆ వేతనం సైతం చేతికందక వారి కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి.
లక్షన్నర మంది
ఒకటి నుంచి పదో తరగతి వరకూ ఉన్న ప్రైవేటు బళ్లలో కనిష్ఠంగా 20మంది ఉపాధ్యాయులు పనిచేస్తూ ఉంటారు. రాష్ట్రవ్యాప్తంగా 11వేలకు పైగా ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేటు స్కూళ్లున్నాయి. వీటిల్లో సుమరు లక్షన్నర మంది ప్రైవేటు ఉపాధ్యాయులుగా పనిచేస్తుంటారని అంచనా.
వీళ్లంతా ప్రస్తుతం జీతాల్లేక అల్లాడుతున్నారు. కొందరికి ఆన్‌లైన్‌లో పాఠాలు చెప్పాలంటూ అవకాశం కల్పించినా.. వేతనం మాత్రం అరకొరగానే చెల్లిస్తున్నారు. తరగతిలో ఉన్న పిల్లల సంఖ్యను బట్టి టీచర్లను నియమించుకునే వాళ్లు. ఇప్పుడు ఆన్‌లైన్ క్లాసుల పుణ్యమాని.. ఒక్క ఉపాధ్యాయునితో వంద మంది బోధన చేసే అవకాశం ఉంది. దీనితో మిగిలిన టీచర్లు ఉపాధి కోల్పోవాల్సి వస్తోంది.
ఆదుకోవాలని...
కూలీలు, రైతులు, కార్మికులు, చిరు వ్యాపారులు, మహిళ సంఘాలకు ఏదో రకమైన కొవిడ్ ప్రోత్సహకాలిచ్చి ఆదుకున్నట్లే... ప్రైవేటు ఉపాధ్యాయులను సైతం అదే తరహాలో ఆదుకోవాలని ప్రైవేటు టీచర్లు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. లేదంటే ఆన్‌లైన్‌లోనో, షిప్టు పద్ధతిలోనో ఏదోలా ప్రాథమిక విద్యారంగానికి సడలింపులు ఇస్తే రాష్ట్రవ్యాప్తంగా లక్షన్నరకు పైగా ఉన్న ప్రైవేటు ఉపాధ్యాయులకు ఉపాధి దొరుకుందని కోరుతున్నారు.
గత ఏడాదిలో ఏప్రిల్, మే, జూన్ మాసాల్లో సెలవులతో స్కూళ్లు నడవకపోయినా.. ఏదో రూపేనా పని తీసుకుని యాజమాన్యాలు జీతాలు చెల్లించాయి. కరోనాతో ప్రస్తుతం స్కూళ్లు తెరవవక... పిల్లలు సైతం ఫీజులు చెల్లించడం లేదు. యాజమాన్యాల దుస్థితిని చూసి టీచర్లు సైతం నోరు మెదపలేకపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఏదోలా ఉపాధి మార్గాన్ని చూపాలని కోరుతున్నారు.
ఇవీ చూడండి:రాష్ట్రంలో కరోనా ఉగ్రరూపం... 20వేలు దాటిన కేసుల సంఖ్య