ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మినీ ఎత్తిపోతల పథకాలు అలంకార ప్రాయంగా మారుతున్నాయి. ఐడీసీ మహబూబ్‌నగర్ డివిజన్ పరిధిలో 45 మినీ ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. వీటన్నింటిని ప్రస్తుతం నీటి పారుదల శాఖ కిందకు తీసుకువచ్చారు. ఇందులో సగానికి పైగా నిరుపయోగంగా ఉన్నాయి. చాలాచోట్ల మోటార్లు చెడిపోయి పనికిరాకుండా తయారయ్యాయి. 2017లో 11 కోట్లతో మరమ్మతులు చేపట్టినా.. మోటార్లు మళ్లీ మొరాయిస్తున్నాయి. ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు విడుదల చేసి మరమ్మతులు చేయించాల్సి ఉన్నా.... నీటిపారుదల శాఖ పట్టించుకోకపోవడంతో ఆయకట్టు రైతులకు సాగునీరు అందడం లేదు.
శిథిలావస్థకు శ్రీ వెంకటేశ్వర ఎత్తిపోతల
నారాయణపేట జిల్లా కృష్ణా మండలం గుడెబల్లూరులోని శ్రీ వెంకటేశ్వర ఎత్తిపోతల పథకాన్ని... భీమా రెండో దశలో భాగంగా 20 ఏళ్ల కిందట నిర్మించారు. దీని ద్వారా గుడెబల్లూరు, కున్సి, హిందూపూర్ గ్రామాలకు చెందిన సుమారు 1600 ఎకరాలకు సాగునీరు అందించాలని రూపకల్పన చేశారు. కాని ఇప్పటివరకూ ఒక్కసారి మాత్రమే ఆయకట్టు రైతులకు రెండు పంటలకు నీళ్లందాయి. ఆ తర్వాత మోటార్లు మరమ్మతులకు గురికాగా.... వాటిని బాగు చేయించలేదు. 3 మోటార్లుండగా రెండింటిని మరో చోటుకు తరలించి వినియోగిస్తున్నారు. ఉన్న ఒక్కమోటారు వినియోగంలో లేకపోవటంతో..... ఎత్తిపోతల పథకం శిథిలావస్థకు చేరింది. ఫలితంగా రెండు పంటలకు నీరందక తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.