తెలంగాణ

telangana

ETV Bharat / state

school in lockdown: ఇళ్ల గోడలే తరగతి గదులు... ఆడతూ, పాడుతూనే విద్యాభ్యాసం - తెలంగాణలో పాఠశాలల పునఃప్రారంభం

రాష్ట్రంలో పాఠశాలలు ప్రారంభం కాబోతున్నాయి. రెండేళ్లుగా బడి గంట మోగకపోవడంతో.... అనేక మంది ఓనమాలు దిద్దలేకపోయారు. నాలుగు అక్షరాలు నేర్చుకున్నవారూ పూర్తిగా మర్చిపోయారు. కానీ మహబూబ్‌నగర్‌ జిల్లాలోని పోచమ్మగడ్డ తండాలో పరిస్థితి భిన్నం. ఆ ఊరి బడిలోని ఉపాధ్యాయురాలుచేసిన ఆలోచన... అక్కడి పిల్లల్ని చదువుకు దూరం కాకుండా కాపాడింది.

school
school

By

Published : Aug 31, 2021, 4:51 PM IST

ఇళ్ల గోడలే తరగతి గదులు... ఆడతూ, పాడుతూనే విద్యాభ్యాసం

కొవిడ్ కారణంగా రెండేళ్లుగా విద్యార్థులు చదువుకు దూరమయ్యారు. కొత్తగా చదువు నేర్చుకోకపోగా... గతంలో నేర్చుకున్న అక్షరాలను మరచిపోయారు. ముఖ్యంగా ఒకటి నుంచి ఐదో తరగతి పిల్లలు... ఒనమాలు, గుణింతాలు, ఒత్తులు, పదాలు ఒంట్లు, ఎక్కాలు ఇలాంటివి పూర్తిగా మరిచిపోయే పరిస్థితి ఎదురైంది. అయితే ప్రతక్ష తరగతులు మొదలైతే పిల్లల చదువులు ఏమవుతాయని కలత చెందిన ఓ ఉ ఉపాధ్యాయురాలి ఆలోచన పిల్లలకు చదువును ఇంటికి చేర్చింది. ఇంటి అరుగులపైనే అక్షరాలు దిద్దుతూ.. లాక్​డౌన్​ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు మహబూబ్​నగర్ జిల్లా జడ్చర్ల మండలం పోచమ్మగడ్డ తండా విద్యార్థులు. ఇదంతా ఆఊళ్లోని ఉపాధ్యాయురాలు కళావతి ఆలోచనలకు నిదర్శనం.

ఇంటి గోడలపై అక్షరాలు

లాక్​డౌన్​ సమయంలో విద్యార్థుల ఇళ్లకు వెళ్లి వారి ఇంటి గోడలనే పాఠాలు నేర్పే నల్లబల్లలుగా మార్చేశారు. గోడలపై నిలిచి ఉండేలా తెలుగు, ఆంగ్ల అక్షరమాల, ఒత్తులు, గుణింతాలు, అంకెలు, సంఖ్యలు, ఎక్కాలు ఇలాంటివి స్వంత ఖర్చులతో రాయించారు. కొంతమందికి సొంతిళ్లు లేవు. గోడలపై రాసేందుకు వారు నిరాకరిస్తే ఫ్లెక్సీలపై రాయించి అందించారు. అలాంటి వాళ్లు పక్కన ఇళ్లలో చదువుకునేలా ప్రోత్సహించారు. ఆన్​లైన్ తరగతులు వింటూనే గోడలపై రాసిన వాటిని విద్యార్థులు పునశ్చరణ చేసుకున్నారు.

వాటిని చూసినప్పుడు ఎప్పటికీ మరచిపోరు..

కేవలం గోడలపై పాఠాలు రాసి వదిలి వేయకుండా సాయంత్రం సమయాల్లో గ్రామంలోని చదువుకున్న వారితో పిల్లలకు పాఠాలు చెప్పించేందుకు గ్రామస్థుల సహకారం కోరారు. ‌వాలంటీర్ల సహకారంతో పిల్లలకు చదువు చెప్పించారు. పాఠశాల ఆవరణలో అంకెలు, ఆంగ్ల అక్షరాలతో పెయింటింగ్​ వేయించారు. ఆడుతూ, పాడుతూ చదువు నేర్చుకునేలా కొత్తగా ఆలోచించానని చెబుతున్నారు పాఠశాల ఉపాధ్యాయురాలు కళావతి. ఇంటిగోడల్ని చూసినప్పుడు కచ్చితంగా అక్షరాలు గుర్తుపెట్టుకుంటారని చెబుతున్నారు ఆమె. తన ఆలోచన విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్థులు, విద్యాకమిటీల సహకారంతోనే కార్యరూపం దాల్చిందని పేర్కొన్నారు.

లాక్​డౌన్​ సమయంలో పాఠశాలలు మూతపడి పిల్లలు అంతవరకు నేర్చుకున్న చదువు మరచిపోయినట్లు అనిపించింది. ఈ సమస్యకు పరిష్కారంగా అక్షరాలు రాస్తే బాగుంటుంది అనిపించింది. ఇంటి గోడలమీద రాసినట్లైతే పిల్లలు చింపేయకుండా.. సాయంత్రం తీరిక వేళల్లో తల్లిదండ్రులు చదివిస్తారని అనిపించింది. ఈ విధానం వల్ల పిల్లలు అప్పటివరకు మరచిపోయిన అక్షరాలను త్వరగా నేర్చుకున్నారు. నాకు చాలా సంతోషంగా అనిపిస్తోంది. తల్లిదండ్రులు కూడా ఫోన్​ చేసి పిల్లలు బాగా చదువుతున్నారని చెబుతున్నారు. - కళావతి, ఉపాధ్యాయురాలు

కొవిడ్ నేపథ్యంలో ప్రభుత్వం ఆన్​లైన్ తరగతులు అందుబాటులోకి తెచ్చినా అయిదో తరగతిలోపు పిల్లలకు అవి అంతగా బుర్రకెక్కలేదు. ఈ నేపథ్యంలో చదువులో ప్రాథమిక అంశాలు మరచిపోకుండా కళావతి చేసిన ప్రయత్నాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు.

ఇదీ చూడండి:Problems in schools: సమస్యలకు నిలయంగా సర్కారు బడులు... పాటించేదెలా కొవిడ్​ నిబంధనలు

ABOUT THE AUTHOR

...view details