మహబూబ్నగర్లో రెచ్చిపోతున్న మట్టిమాఫియా Land mafia is raging in Mahbubnagar: మహబూబ్ నగర్ పట్టణానికి నలువైపులా ఉన్న ప్రకృతి వనరులు ధ్వంసమవుతున్నాయి. పచ్చగా పట్టణానికి కనువిందు చేస్తున్న గుట్టలు.. కానరాకుండా పోతున్నాయి. మట్టి మాఫియా యథేచ్ఛగా గుట్టల్ని కరిగించేస్తున్నాయి. రెవెన్యూ, మైనింగ్ శాఖ అనుమతులు లేకుండా వెంచర్లకు, భవన నిర్మాణాల కోసం అమ్మేసుకుంటున్నారు. ఇప్పటికే ఎదిర సమీపంలోని ఊరగుట్టను అనుమతి లేకుండా తవ్వేసి ప్రభుత్వానికి ఎలాంటి రుసుములు చెల్లించకుండా సర్కారీ ఆదాయానికి గండి కొట్టేశారు.
తాజాగా తిరుమల హిల్స్ వెనకాల ఎదిర రెవెన్యూ శివారులో చౌడమ్మ గుట్టను సైతం తవ్వేశారు. పగలు, రాత్రి టిప్పర్ల ద్వారా మట్టి తరలించారు. దాదాపు గుట్టను ఖాళీ చేశారు. ఈ మట్టిని ఎదిర, దివిటిపల్లి, హౌసింగ్ బోర్డు, కాలనీ పరిసరాల్లోని కొత్తగా ఏర్పాటవుతున్న వెంచర్లకు, ఇంటి పునాదుల కోసం అమ్మేసి సొమ్ము చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇంత జరుగుతున్నా అధికార యంత్రాంగం మాత్రం చేష్టలుడిగి చూస్తోంది.
చౌడమ్మగుట్ట పరిధిలోనే 60వేల375 టన్నుల మట్టిని అక్రమంగా తరలించినట్లు మైనింగ్ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. అనుమతి లేకుండా మట్టి తరలించినందుకు క్యూబిక్ మీటరుకు 20 రూపాయల చొప్పున.. 10 రెట్ల జరిమానా కోటి 20 లక్షలు చెల్లించాలని మైనింగ్ అధికారులు నోటీసులు సిద్ధం చేశారు. వెంచరు ఏర్పాటు చేసిన వ్యక్తులు ఎవరో, మట్టిని తరలించిన యంత్రాలు, టిప్పర్లు ఎవరివో గుర్తించేందుకు.. మైనింగ్ శాఖ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.
నిబంధనల మేరకు సొంతభూమైనా సరే సహజ వనరులైన మట్టిని తరలిస్తున్నప్పుడు.. మైనింగ్ శాఖ అనుమతులు తీసుకోవాలి. ప్రభుత్వ భూముల నుంచి తరలిస్తే రెవెన్యూ, స్థానిక సంస్థల అనుమతులు పొందాలి. అక్రమంగా తరలిస్తే రెవెన్యూశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలి. ఇవేవీ పాలమూరు పట్టణంలో అమలు కావడం లేదన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. పాలమూరు చుట్టుపక్కల గుట్టల నుంచి ఎంత మట్టి బయటకు తరలిందో అంచనా వేసి.. అక్రమంగా వాటిని తీసుకెళ్లిన వారిని గుర్తించి.. జరిమాన విధిస్తే కనీసం ప్రభుత్వానికైనా అదాయం సమకూరుతోందన్న డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.
ఇవీ చదవండి: