SSC Exams: కరోనా పరిస్థితులు వాయిదాలు, రద్దుల తర్వాత రాష్ట్రంలో మళ్లీ పదో తరగతి పరీక్షలు ఈ నెల 23 నుంచి ప్రారంభంకానున్నాయి. విద్యార్థుల కోసం పక్కాగా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు చెబుతున్నా చాలాచోట్ల వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలనే పరీక్షా కేంద్రాలకు ఎంపిక చేయగా.. అందుకు తగిన ఏర్పాట్లు చేయటంలో యంత్రాంగం విఫలమమవుతోంది. మహబూబ్‌నగర్ జిల్లాలో 59 కేంద్రాలను ఎంపికచేయగా.. 274 పాఠశాలలకు చెందిన 13,242 మంది అక్కడ పరీక్షలు రాయనున్నారు. చాలాచోట్ల పరీక్షలు రాసేందుకు కావాల్సిన ఏర్పాట్లు పూర్తికాలేదు. జిల్లాలో 40-42 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా.. ఎండల ప్రభావం విద్యార్థులపై పడకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉన్నా అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టడంలేదు.. అనేక కేంద్రాల్లోని గదులకు కరెంట్ సరఫరా లేదు. కొన్నిచోట్ల ఉన్నా.. తరగతి గదుల్లో లైట్లు, ఫ్యాన్లు అందుబాటులో లేకపోవడంతో.. సరైన గాలి, వెలుతురు రావటంలేదు. ఉక్కపోతలోనే విద్యార్థులు పరీక్షలు రాయాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి.
నేలపై కూర్చునే రాయాల్సిన దుస్థితి: రెండేళ్లుగా పాఠశాలలు పూర్తి స్థాయిలో నడవనందున కొత్త బెంచీలు ఏర్పాటు చేయలేదు. కొన్నిచోట్లైతే నేలపై కూర్చుని పరీక్షలు రాయాల్సిన దుస్థితి. పాఠశాల ఆవరణలో మరుగుదొడ్లు సరిపడలేకపోవటం.. ఉన్నవాటిలో పరిశుభ్రత లోపించి, దుర్గంధభరితంగా మారాయి. పంచాయతీ పారిశుద్ధ్య సిబ్బందితో శుభ్రతా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించినా... పాఠశాలల్లో పనిచేసేందుకు విముఖత చూపుతున్నారు. మహబూబ్‌నగర్‌తో పాటు మిడ్జిల్, దేవరకద్ర, కోయిలకొండ, జడ్చర్ల తదితర కేంద్రాల్లో మంచినీటి సమస్య తీవ్రంగా ఉంది.