kurumurthy temple: తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం మహబూబ్ నగర్ జిల్లాలోని కురుమూర్తి దేవస్థానం. కురుమూర్తి దేవస్థాన వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 24 నుంచి ప్రారంభం కానున్నాయి. నెలరోజుల పాటు ఈ తిరునాళ్లు కొనసాగుతాయి. జాతరను తిలకించేందుకు కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ సహా తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి భక్తులు తరలి వస్తుంటారు. జాతరకొచ్చే భక్తులకు ఈసారి ప్రయాణం పరీక్షగా మారనుంది. కారణం ఆ మార్గంలో రోడ్లు అధ్వాన్నంగా ఉండటమే. కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వికారాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ సహా వివిధ జిల్లాల నుంచి వచ్చే భక్తులు... మహబూబ్‌నగర్, దేవరకద్ర మీదుగా 2 మార్గాల ద్వారా కురుమూర్తి జాతరకు చేరుకోవచ్చు. దేవరకద్ర నుంచి పుట్టపల్లి, కౌకుంట్ల, వెంకంపల్లి మీదుగా కురుమూర్తిని చేరుకోవచ్చు. ఈ దారిలో 2 రైల్వే గేట్లున్నాయి. ఇదేమార్గంలో ప్రమాదకరంగా 9 కల్వర్టులున్నాయి. గతంలో ఈ కల్వర్టుల వద్ద ప్రమాదానికి గురై ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. జాతర ప్రారంభానికి ఇంకా కొన్నిరోజులే ఉండటం, ఎక్కడా మరమ్మతులు చేపట్టకపోవడంతో.. వాహన దారులకు.. ఈసారి ఇబ్బందులు తప్పేలా లేవు.
ఇక కోయల్ సాగర్ కాల్వల నుంచి సాగునీటిని తీసుకు వెళ్లేందుకు పైప్ లైన్ల కోసం రైతులు ఇష్టానుసారంగా రోడ్లను తవ్వేశారు. వాటిని సక్రమంగా పూడ్చకపోవడంతో వేగంగా వచ్చే వాహనదారులు ఆ గుంతల్ని గమనించకుండా ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ మార్గంలో పుట్టపల్లి రైల్వేగేటు అవతల, ఇవతల, డోకూరు కేజీవీబీ దగ్గర, కౌకుంట్ల పాతరైల్వే గేటు వద్ద మలుపులు ప్రమాదకరంగా మారాయి. పుట్టపల్లి నుంచి పాత రైల్వేగేటు వరకూ కిలోమీటర్ కు పైగా రోడ్డుమార్గం పూర్తిగా గుంతలమయమైంది. దేవరకద్ర నుంచి గుడిబండ, ముచ్చింతల, అప్పంపల్లి మీదుగా జాతర వెళ్లే మార్గం రెండోదారి. ఈ మార్గంలోనూ 6చోట్ల ప్రమాదకరమైన మలుపులున్నాయి. సూచిక బోర్డులు సరిగా లేవు.