KTR Mahbubanagar Tour : పాలమూరుకు తలమానికం కానున్న ఐటీ కారిడార్‌లో తొలి సంస్థను పురపాలక, ఐటీ శాఖల మంత్రి తారక రామారావు ప్రారంభించారు. దివిటిపల్లిలోని ఐటీ కారిడార్‌లో నూతనంగా నిర్మించిన ఈ ఐటీ టవర్‌ను మంత్రి శ్రీనివాస్ గౌడ్‌తో కలిసి ప్రారంభించిన కేటీఆర్.. అక్కడే 262 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న అమరరాజా గిగా కారిడార్‌కు శంకుస్థాపన చేసి, భూమిపూజ చేశారు. 262 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న ఈ గిగా కారిడార్ ప్రారంభోత్సవంలో అమర్ రాజా ఛైర్మన్, ఎంపీ గల్లా జయదేవ్‌తో పాటు సంస్థ వ్యవస్థాపకుడు గల్లా రామచంద్ర నాయుడు, గల్లా అరుణ కుమారితో కలిసి కేటీఆర్ భూమి పూజ చేశారు.
Amararaja Battery Company in Mahabubnagar: ఐటీ కారిడార్‌లో నిర్మించిన రోడ్లను ప్రారంభించి.. పరిశ్రమల ఏర్పాట్లు, వాటికి కల్పిస్తున్న మౌలిక వసతుల కల్పనను కేటీఆర్ పరిశీలించారు. అమరరాజా కంపెనీలో లిథియంతో బ్యాటరీలు ఉత్పత్తి చేస్తారని, దీంతో పర్యావరణానికి ఎలాంటి నష్టం వాటిల్లదని ఆయన తెలిపారు. పదేళ్లలో అమరరాజా రూ.9 వేల 500 కోట్ల పెట్టుబడి పెట్టనుందని వెల్లడించారు. ఈ ఐటీ కారిడార్‌కు త్వరలోనే మరిన్ని సంస్థలు వస్తాయని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
"మహూబూబ్‌నగర్‌లో తప్పకుండా ఇంకా పదుల సంఖ్యలో పరిశ్రమలు తరలి వస్తాయనే విశ్వాసం నాకుంది. మేము ఎంతో కష్టపడి ఈరోజు ఇతర రాష్ట్రాలతో, ఇతర దేశాలతో పోటీ పడి వారిని ఒప్పించి, మెప్పించి పరిశ్రమలను తెస్తున్నాం. బ్యాటరీ పరిశ్రమ కాబట్టి ఇక్కడ కాలుష్యం వస్తుందని కొంతమంది మాట్లాడుతున్నారు. ఇక్కడ పెట్టబోతుంది లెడ్ ఆసిడ్ బ్యాటరీ ప్లాంట్ కాదు. ఇక్కడ లిథియం అయాన్ బ్యాటరీ మేకింగ్." - కేటీఆర్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి