రాబోయే 10 మాసాల్లో పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. వెయ్యి కోట్లు అప్పులు తీసుకొచ్చామని, వచ్చే బడ్జెటులో మరిన్ని నిధులు కేటాయించి త్వరలోనే ప్రాజెక్టును పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటాన్నారు. నిధులు సరిపోకుంటే.. హైదరాబాదులో ఉన్న విలువైన భూములను అమ్మకానికి పెట్టైనా ఆ డబ్బును పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల నిర్మాణానికి ఖర్చు చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. మూడు షిప్టుల్లో పనిచేసి వచ్చే ఖరీఫ్ నాటికి జలాశయాలను అందుబాటులోకి తీసుకురావాలన్నారు.
ప్రాజెక్టుల పనుల పరిశీలన
ఈ ప్రాజెక్టు పూర్తైతే మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వికారాబాద్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలు సస్యశ్యామలం అవుతాయని, హైదరాబాదు తాగునీటి ఎద్దడి తీరుతుందన్నారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ఈ ప్రాజెక్టు పనులను సాగునీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం పరిశీలించారు. మహబూబ్నగర్ జిల్లాలోని భూత్పూరు మండలం కరివెన వద్ద నుంచి ఎత్తిపోతల పథకం పనులను ముందుగా విహంగ వీక్షణం ద్వారా పరిశీలించారు. అనంతరం జలాశయం వద్ద పాలమూరు పథకానికి సంబంధించిన చిత్ర ప్రదర్శనను తిలకించారు.
24గంటలు పనులు జరిగేలా చూడాలి
కరివెన జలాశయం పనులను ఎన్ని రోజుల్లో పూర్తిచేస్తారని అధికారులను, ఏజెన్సీలను ముఖ్యమంత్రి ప్రశ్నించారు. ఏడాదిలోపు చేస్తామని అధికారులు బదులిచ్చారు. ‘అంత ఆలస్యం ఎందుకు?.. నాలుగున్నర నెలల్లో పూర్తి చేయాలి’ అని ఆదేశించారు. 24 గంటలూ పనులు జరిగేలా చూడాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనులు అలాగే పూర్తయ్యాయన్నారు. ఉదయం ప్రతిపాదనలు పంపితే సాయంత్రానికల్లా నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. పెండింగు బిల్లులను కూడా విడుదల చేస్తానన్నారు. కరివెన, ఉదండాపూర్ జలాశయాల నుంచి కోయిల్సాగర్కు నీటిని సరఫరా చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ, పరిహారం సక్రమంగా అందేలా చూడాలన్నారు.