ఇతర రాష్ట్రాల్లో తక్కువ ధరకు ధాన్యాన్ని కొని తెలంగాణలో మద్దతు ధరకు అమ్మి కొందరు అక్రమార్కులు లాభాలు గడిస్తున్నారు. ఇందుకు నిదర్శనమే ఉమ్మడి పాలమూరు జిల్లాలో పట్టుబడుతున్న కర్ణాటక ధాన్యం. కర్ణాటక నుంచి అక్రమంగా మిర్యాలగూడ, హైదరాబాద్ మిల్లులకు వరిధాన్యాన్ని తరలిస్తున్న 16 లారీలను ఈ నెల 15న నారాయణపేట జిల్లా మక్తల్ మండలం చందాపూర్ శివారులో పోలీసులు పట్టుకున్నారు.
యాద్గిర్, సిర్పూరు, మాన్వీల నుంచి తరలిస్తున్నట్లు గుర్తించారు. ఒక్కో లారీపై రూ. 5 వేలు జరిమానా విధించారు. అంతకు ముందు నారాయణపేటలో మే 4న కర్ణాటక నుంచి ధాన్యాన్ని తరలిస్తున్న 6 లారీలను పట్టుకున్నారు. దామరగిద్ద మండలంలో మే 10న బొలేరో వాహనంలో 24 క్వింటాళ్ల ధాన్యం ... మే 11న రెండు లారీల్లో 505 క్వింటాళ్ల ధాన్యాన్ని అక్రమంగా తరలిస్తూ దొరికారు.
జోగులాంబ గద్వాల జిల్లా కేటీ దొడ్డి మండలం నందిన్నె చెక్ పోస్టు వద్ద కర్ణాటక నుంచి అక్రమంగా తరలిస్తున్న 4 లారీలపై కేసు నమోదు చేశారు. పక్క రాష్ట్రం నుంచి వరి ధాన్యం తెలంగాణకు తరలుతోందని చెప్పడానికి ఇవి మచ్చుకు కొన్ని. అధికారులు, పోలీసుల కన్నుగప్పి కర్ణాటక ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో ఇతర రైతుల పేరిట అమ్మే దందా ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొనసాగుతోంది.
ఏప్రిల్‌లో వరి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. అప్పుడే పక్క రాష్ట్రాల నుంచి వరి ధాన్యం రాష్ట్రంలోకి రాకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కానీ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలతో సరిహద్దులున్న ఉమ్మడి పాలమూరులో ధాన్యం తరలింపుపై నిఘా కరవైందనే ఆరోపణలు వస్తున్నాయి.