Kalwakurthy lift irrigation project Problems in Mahbubnagar :ఉమ్మడి పాలమూరు జిల్లాలో మూడున్నర లక్షల ఎకరాలకు సాగునీరందించే మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం నిర్వహణ ప్రశ్నార్థకంగా మారుతోంది. ముఖ్యంగా రెండో దశలో భాగమైన జొన్నలబొగుడ జలాశయం నిర్వహణను అధికారులు గాలికొదిలేశారు. రూ.49 కోట్లలతో జలాశయాన్ని నిర్మించగా 2015 నుంచి నిర్వహణ బాధ్యతను గుత్తేదారు ప్రభుత్వానికి అప్పగించారు.
అప్పటి నుంచి నిర్వహణ సరిగా ఉండట్లేదు. జలాశయం రివిట్‌మెంట్, సపోర్టుగా ఉన్న సిమెంట్ పిల్లర్ల మధ్య వేప, మోదుగు, జిల్లేడు లాంటి చెట్లు పెరిగాయి. మట్టికట్టపై కంప చెట్లు పెరిగి చిట్టడవిని తలపిస్తూ వెళ్లేందుకు దారి లేకుండా పోతోంది. దీంతో కట్ట మనుగడపై రైతులు ఆందోళన చెందుతున్నారు. జొన్నల బొగుడ నుంచి గుడిపల్లిగట్టు జలాశయానికి నీరు విడుదల చేసే తూము తలుపులు దెబ్బతిని సాగునీరు వృధాగా పోతోంది. 3 తూములు ఏర్పాటు చేయగా మొదటి తూము షట్టర్ ఇరుక్కుపోయింది. 4 నెలల కిందట మరమ్మతులు చేపట్టినా లీకేజీలను అరికట్ట లేకపోయారు.
షట్టర్ల మరమ్మతుకు అవసరమైన యంత్రాలు, నిధుల లేమితో లీకేజీని అరికట్టడం కష్టంగా మారుతోంది. ఉన్న కొద్దిపాటి నీళ్లు సైతం లీకేజీల ద్వారా వృధాగా పోవడంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాల్వలు ఉన్నంత వరకైనా సాగునీరు అందుతుందా అంటే అదీ లేదు. తూముల లీకేజీలతో నీళ్లు విడుదల చేసినప్పుడు మొదటి ఆయకట్టు రైతుల పొలాల్లోకి నీరు చేరి పంటలు దెబ్బతింటున్నాయి. లీకేజీలతో సాగునీరు అధికమైన చోట జమ్ము మొలిచి రైతులు పొలాల్ని సాగుచేయడమే వదిలేశారు.