NQAS certification to mahbubnagar phc : జాతీయ నాణ్యత హామీ ప్రమాణాలను(నేషనల్ క్వాలిటీ అస్సూరెన్స్ స్టాండర్డ్స్) చేరుకోవడంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పీహెచ్సీలు వెనకబడ్డాయి. ఐదు జిల్లాల్లో 77 ఆరోగ్యకేంద్రాలకు గాను మహబూబ్నగర్ జిల్లాలో-6, నారాయణపేట-01, నాగర్ కర్నూల్-05, వనపర్తి-02, జోగులాంబ గద్వాల జిల్లాలో-4 మాత్రమే ఎన్-క్వాస్ ధ్రువీకరణ పొందాయి. మిగిలిన కేంద్రాలు నాణ్యతా ప్రమాణాలను చేరుకోవడంలో విఫలమవుతున్నాయి.
మూడేళ్ల పాటు ఏటా రూ.3లక్షల నిధులు
ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో అంతర్జాతీయ, జాతీయ అత్యుత్తమ వైద్య ప్రమాణాలతో ప్రజలకు సేవలందించాలన్న లక్ష్యంతో కేంద్రం ఈ జాతీయ నాణ్యత హామీ ప్రమాణాలను రూపొందించింది. వాటిని పాటించే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు కేంద్రం మూడేళ్ల పాటు ఏటా రూ.3లక్షల నిధులు మంజూరు చేస్తుంది. తద్వారా పీహెచ్సీలను బలోపేతం చేయాలన్నది లక్ష్యం. ఎన్-క్వాస్ ధ్రువీకరణ ఉందంటే అక్కడి ఆరోగ్య కేంద్రంలో రోగులకు ఉత్తమ నాణ్యతా ప్రమాణాలతో సేవలు అందుతున్నట్లు పరిగణిస్తారు.
50 అంశాల లెక్కింపు
కేంద్రం నిర్దేశించిన ప్రమాణాలను చేరుకోవడం సులువేం కాదు. ఆరోగ్య కేంద్రాల్లో అందుతున్న సేవలు, రోగుల హక్కులు, వసతులు, ఇన్ఫెక్షన్ నియంత్రణ, నాణ్యత ప్రమాణాల నిర్వాహణ, సేవల ఫలితాల తీరును కేంద్ర బృంద సభ్యులు సమీక్షిస్తారు. బయటి రోగుల విభాగం, లేబర్ రూమ్, ఇన్పేషెంట్ విభాగం, ల్యాబ్ సేవలు, జాతీయ ఆరోగ్య మిషన్, సాధారణ పరిపాలన ఎలా ఉన్నాయో ప్రత్యక్షంగా చూస్తారు. 50రకాల ప్రమాణాలు ఆధారంగా 250 అంశాలను లెక్కిస్తారు.
- పరిశుభ్రత ఎలా ఉంది?
- కనీస వసతులున్నాయా?
- రికార్డులు నిర్వహిస్తున్నారా ?
- కేంద్రంలో అందే సేవలు రాష్ట్ర, జాతీయ సగటుతో పోల్చితే ఎలా ఉన్నాయి?
- ప్రభుత్వ ఆరోగ్య పథకాలు అమలవుతున్నాయా?
- సమాచార బోర్డులు
- నేలశుభ్రత
- పచ్చదనం
- ప్రహారీ
- సిబ్బంది ప్రవర్తన
- రోగుల సంతృప్తి స్థాయిలు
ఇలా ప్రతి అంశాన్ని పరిగణలోకి తీసుకుంటారు. 70శాతం కంటే అధికంగా స్కోర్ సాధించిన ప్రాథమిక ఆరోగ్యం కేంద్రాలకు మాత్రమే ఎన్-క్వాస్ ధ్రువీకరణ దక్కుతుంది.
ఎన్క్యూఏఎస్ సర్టిఫికెట్ ఇచ్చే సెంట్రల్ కమిటీ అన్ని అంశాలను పరిశీలిస్తుంది. పీహెచ్సీలో అమలవుతున్న ప్రమాణాలపై సర్టిఫికెట్ ఇస్తారు. ఆ ధ్రువీకరణ పత్రం ఆరోగ్యకేంద్రం అభివృద్ధికి ఉపయోగపడుతుంది. అదనపు నిధులు వస్తాయి.
-పీహెచ్సీ డాక్టర్