పండించిన పత్తిని అమ్ముకోకుండా ఆశించిన ధర కోసం క్వింటాళ్ల కొద్దీ పత్తిని ఇళ్లలోనే నిల్వ ఉంచుకున్న పరిస్థితి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో నెలకొంది. వానాకాలంలో సుమారు 9లక్షల ఎకరాల్లో రైతులు పత్తి సాగుచేశారు. ఎకరాకు 10 నుంచి 15 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. కాని అధిక వర్షాలు, వాతావరణ పరిస్థితుల కారణంగా పత్తి దిగుబడి 5 నుంచి 10 క్వింటాళ్లకు పడిపోయింది. ఎరువులు, పురుగుల మందులు, కూలీ ఖర్చులు పెరిగి పెట్టుబడులు అధికమయ్యాయి.
దిగుబడులు పడిపోయాయి. తీరా పండించిన పంటను అమ్ముకునేందుకు వస్తే ఆశించిన ధర లేదు. దీంతో రైతులు పత్తిని అమ్మకుండా ఇళ్లలోనే నిల్వ ఉంచారు. ధర వచ్చినప్పుడే అమ్ముకుందామని నిర్ణయించుకున్నారు. ఇళ్లలోనే పత్తి నిల్వ ఉంచుకోవడం అన్నదాతలకు సైతం ఇబ్బందిగా మారుతోంది. చీడపీడలు సోకి, పురుగుమందులు జల్లిన పత్తిని ఇంట్లో నిల్వ ఉంచడంతో కొందరికి అలర్జీలు వస్తున్నాయి.
క్వింటా పదివేల వరకూ కొనుగోలు చేస్తే అమ్మేందుకు సిద్ధం: చర్మంపై దద్దుర్లతో బాధ పడుతున్నారు. పైగా పత్తిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సి వస్తోంది. పత్తి నిల్వలున్నచోట ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా అగ్నిప్రమాదాలకు అవకాశం ఉంటుంది. దీంతో బిక్కుబిక్కమంటూనే రైతులు పత్తిని కాపాడుతూ వస్తున్నారు. ప్రభుత్వం స్పందించి క్వింటా రూ.10,000 వరకూ కొనుగోలు చేస్తే అమ్మేందుకు సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు. నవంబర్, డిసెంబర్ మాసాల్లో పత్తి రాకతో కళకళలాడాల్సిన మార్కెట్లు వెలవెలబోయాయి.
సగానికి.. సగం పడిపోయిన పత్తి కొనుగోళ్లు: గతేడాదితో పోల్చితే జిన్నింగ్ మిల్లులు కొనుగోలు చేసిన పత్తి సగానికి.. సగం పడిపోయింది . నాణ్యమైన పత్తిని ఇంట్లోనే దాచుకున్న రైతులు.. ఖర్చులు, అప్పులు తీర్చడం కోసం.. తక్కువ నాణ్యత ఉన్న పత్తిని అమ్మి అవసరాలు తీర్చుకున్నారు. అత్యవసరమైతే తప్ప పత్తిని అమ్మడం లేదు. అలా 60శాతం పత్తి అమ్ముడవగా 40శాతం వరకూ ఇంకా అన్నదాతల వద్దే ఉందని అధికారుల అంచనా.
తక్కువ ధరకు పత్తిని అమ్మేదే లేదు: గతేడాది జనవరిలో బాదేపల్లి మార్కెట్ లో పత్తి క్వింటా రూ. 9,800 వరకూ పలికింది. ఫిబ్రవరి, మార్చిలోనూ రూ.10,000 గరిష్ఠ ధర నమోదైంది. ఈసారి కూడా అదే ధర వస్తుందని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఎన్నాళ్లైనా నిల్వ ఉంచుతామే గాని.. తక్కువ ధరకు పత్తిని అమ్మేదే లేదని రైతులు భీష్మించుకుని కూర్చున్నారు. పత్తిని విస్తారంగా పండించే ఉమ్మడి పాలమూరు జిల్లాలో గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి లేదు.