కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సూదిని జైపాల్ రెడ్డి మృతితో పాలమూరు జిల్లా శోకసంద్రంలో మునిగిపోయింది. భౌతికంగా, రాజకీయంగా జన్మనిచ్చిన పాలమూరుతో జైపాల్ రెడ్డిది విడదీయరాని అనుబంధం. ఉమ్మడి పాలమారు జిల్లా ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా మాడ్గుల ఆయన సొంత గ్రామం. దుర్గారెడ్డి, యశోదమ్మ దంపతులకు జైపాల్ రెడ్డి మొదటి సంతానం. ఆయన పాఠశాల విద్య మాడ్గుల, దేవరకొండలో... ఉన్నత చదువులు హైదరాబాద్‌లో పూర్తి చేశారు.
విద్యార్థి దశ నుంచే...
విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించిన జైపాల్ రెడ్డి... 1969లో మొదటిసారిగా కల్వకుర్తి శాసనసభ్యనిగా ఎన్నికయ్యారు. వరుసగా 4 పర్యాయాలు కల్వకుర్తి నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. 1980లో మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఇందిరాగాంధీ చేతిలో ఓటమిపాలయ్యారు. 1984లో జనతాపార్టీ అభ్యర్థిగా మహబూబ్‌నగర్ నుంచి పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యారు. 1998లో జనతాదళ్ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. 1999, 2004లో మిర్యాలగూడ, 2009లో చేవెళ్ల నుంచి ఎంపీ గెలుపొందారు. 1991 నుంచి 1998 వరకు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. యూపీఏ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా పని చేశారు. 2014 చేవెళ్లలో ఓడిపోయిన జైపాల్ రెడ్డి 2019లో మహబూబ్‌నగర్ నుంచి బరిలో ఉంటాడని అందరూ ఊహించినా... అనారోగ్యం, వయోభారంతో పోటీకి దూరంగా ఉన్నారు.
ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్రమంత్రిగా పాలమూరు జిల్లా అభివృద్ధికి ఆయన కృషి చేశారు. పుట్టిన ఊరు మాడ్గుల తాగునీరు, ప్రభుత్వ జూనియర్ కళాశాల, కోయిల్ సాగర్ నుంచి మహబూబ్‌నగర్‌కు తాగునీరు రప్పించడంలో కీలక భూమిక పోషించారు. కల్వకుర్తి నియోజకవర్గంలో విద్యుత్ సమస్య పరిష్కారం చెప్పుకోదగింది. జిల్లా కేంద్రంలోని ఈద్గాకు ప్రతి రంజాన్, బక్రీద్ పర్వదినాన సందర్శించడం ఆయనకు ఆనవాయితీగా మారింది.
పాలమూరుతో విడదీయని అనుబంధం ఆయనది ఇదీ చూడండి: గొప్ప రాజనీతిజ్ఞుడిని కోల్పోయాం: వెంకయ్యనాయుడు