పరిహారం కోసం రైతుల పడిగాపులు.. ఉపాధి కోసం యువత ఎదురుచూపులు Youth Expectations For Employment Opportunities: ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో ఐటీ సేవలు విస్తరించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం మహబూబ్‌నగర్‌లో నిర్మించతలపెట్టిన ఐటీ హబ్ నిర్మాణంలో తీవ్రజాప్యం జరుగుతోంది. 2018 జులై 7న ఐటీ, బహుళ సేవల పారిశ్రామిక పార్కుకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. పారిశ్రామిక పార్కు కోసం 371 ఎకరాలు సేకరించారు.
ఆ భూముల్లో పరిశ్రమల ఏర్పాటు కోసం రహదారులు, విద్యుత్, డ్రైనేజీ, మంచినీరు సహా మౌలిక వసతులు కల్పించాల్సి ఉంది. ఐటీ టవర్ భవనం నిర్మాణానికి 40 కోట్లు కేటాయించగా పనులు కొనసాగుతున్నాయి. 4 ఎకరాల విస్తీర్ణంలో ఐదంతస్తుల భవనాన్ని నిర్మిస్తుండగా సివిల్ పనులు పూర్తయ్యాయి. ఇప్పటి వరకూ 80 శాతం పనులు పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు.
371 acres of land for industrial park: 2018 జనవరిలో కరీంనగర్‌లో ప్రారంభించిన ఐటీ టవర్ పనులను పూర్తై వినియోగంలోకి వచ్చినా మహబూబ్‌నగర్‌లో మాత్రం ఇప్పటికీ పూర్తికాలేదు. మహబూబ్‌నగర్ జిల్లాలో ఏర్పాటు చేసిన ఐటీ టవర్ హైదరాబాద్-బెంగళూరు, కోదాడ-రాయచూర్ జాతీయ రహదారులకు సమీపంలో ఉంది. శంషాబాద్ విమానాశ్రయానికీ దగ్గర్లో ఉండటంతో ఐటీ కంపెనీలు అక్కడకు వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నాయి.
IT Tower Set up in Mahbubnagar District: ఒకవేళ కరీంనగర్, ఖమ్మంలాగే ఐటీ సేవలు పాలమూరు నుంచి ప్రారంభమైతే నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు దక్కే అవకాశం ఉంటుంది. ఇదే ఆశతో భూములిచ్చిన స్థానికులు ఐటీ పార్కు ఏర్పాటుకు జరుగుతున్న జాప్యంతో ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వం చెప్పినట్లుగా ఐటీ పార్క్ తప్పితే కాలుష్యాన్ని వెదజల్లే ఏ ఇతర పరిశ్రమల ఏర్పాటును అనుమతించబోమని స్థానికులు తేల్చిచెబుతున్నారు.
ఓ బ్యాటరీ తయారీ కంపెనీ ఇక్కడికి రానుందంటూ గత కొన్ని రోజులుగా సాగుతున్న విస్తృత ప్రచారంతో, పరిసర గ్రామాలు ఆందోళనకు గురవుతున్నాయి. ఐటీ టవర్‌లోగాని, ఐటీ పార్క్‌లో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ఇప్పటి వరకూ ఏ సంస్థ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కాలుష్యం లేని పరిశ్రమలు మాత్రమే ఏర్పాటు చేయాలని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
దివిటిపల్లిలో ఐటీటవర్‌తోపాటు 100ఎకరాల్లో 2వేల కోట్ల పెట్టుబడితో న్యూ ఎనర్జీ పార్కు, ఎలక్ట్రికల్ వాహనాలు, లిథియం ఆయాన్ బ్యాటరీల తయారీ పరిశ్రమలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. స్థానికంగా జరుగుతున్న ప్రచారంపై ఇటీవల ప్రజాభిప్రాయ సేకరణలో కలెక్టర్ స్పష్టతనిచ్చారు. కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలేవి ఇక్కడ ఏర్పాటు చేయటంలేదని, ప్రజాభిప్రాయాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందని తెలిపారు. నమ్ముకున్న భూములను ప్రభుత్వానికి అప్పగించామని, నాడు చెప్పినట్లుగా ఐటీ హబ్ పనులు త్వరితగతిన పూర్తిచేసి ఆ దిశగా పరిశ్రమలను ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
ఇవీ చదవండి: