Telangana Botanical Garden in Jadcharla: మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల బీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలంగాణ బొటానికల్ గార్డెన్‌కు అంకురార్పణ జరిగి మూడేళ్లు గడుస్తోంది. ఒకప్పుడు 300 రకాలకు చెందిన 800 మొక్కలతో అందరినీ ఆకర్షించిన ఈ నందనవనం.. రాష్ట్ర ప్రభుత్వ నిధులు, దాతల సహకారంతో అదనపు హంగులతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటోంది. వృక్షశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో అభివృద్ధి చెందుతున్న ఈ వనం.. అనేక ప్రత్యేకతలకు నిలయం. పైనుంచి చూస్తే తెలంగాణ ఆకారంలో కనిపించడం దీని ప్రత్యేకత.
Telangana Botanical Garden in Mahabubnagar District: 5 ఎకరాల స్థలాన్ని 33 జిల్లాలుగా విభజించి.. ఒక్కో జిల్లాలో ఒక్కో రకమైన మొక్కల్ని పెంచారు. సిద్దిపేట పటంలో రోజావనం, నాగర్‌కర్నూల్ జిల్లా అటవీ వనం, మెదక్‌లో నక్షత్ర వనం.. ఇలా ఆ జిల్లా ప్రత్యేకతలను బట్టి మొక్కల్ని పెంచారు. నల్లమల, శేషాచలం అడవుల్లో మాత్రమే కనిపించే మొక్కలు.. అంతరించిపోయే జాతులు ఇక్కడ చిగురిస్తుంటాయి. 153 రకాల అటవీ మొక్కలు, 23 రకాల మర్రిజాతులు, 30 రకాలకు పైగా అంతరించిపోతున్న జాతులు, గ్రామీణ ప్రాంతాల్లోనే దొరికే ఔషధ మొక్కలు, పూలు, పండ్ల పంటలు ఇలా చెప్పుకుంటూ పోతే సుమారు 527 రకాలకు చెందిన 6 వేల మొక్కలు బొటానికల్ గార్డెన్‌లో దర్శనమిస్తాయి.
ప్రతి మొక్కకు క్యూ ఆర్ కోడ్: ఈ 527 రకాల మొక్కల్ని ఎక్కడెక్కడి నుంచో తెచ్చి సంరక్షిస్తుండగా.. సామాన్యులకు, విద్యార్థులకు వాటి గురించి తెలిసేందుకు ప్రతి మొక్కకు క్యూ ఆర్ కోడ్‌ను అమర్చారు. గూగూల్ లెన్స్‌తో దీనిని స్కాన్ చేస్తే మొక్క తన గురించి తాను చెప్పుకుంటుంది. ఇక్కడ పెంచే మొక్కలను ఎలాంటి రసాయనాలు వాడకుండా సేంద్రీయ విధానంలో సంరక్షిస్తున్నారు. ఇక్కడి చెత్తను కంపోస్టు ఎరువుగా తయారు చేసి తిరిగి మొక్కలకే వినియోగిస్తారు. సేకరించడం, సంరక్షించడం, పెంచడం, పునరుత్పత్తి అన్ని ఇక్కడ ప్రత్యక్షంగా తిలకించవచ్చు.