దేశంపై కొవిడ్ పంజా విసిరినప్పటి నుంచి రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్య గందరగోళంగా మారింది. అర్థంకాని ఆన్లైన్ చదువులు చదివి, పరీక్షలు రాయకుండానే విద్యార్ధులు ఇంటర్ మొదటి, ద్వితీయ తరగతులకు చేరుకున్నారు. వివిధ కోర్సుల్లో ప్రవేశాలు పొంది, చదువులు సరిగ్గా సాగక సబ్జెక్టుల్లో ఉన్నపట్టు కోల్పోయారు. సెప్టెంబర్ 1 నుంచి ప్రత్యక్ష తరగతులు ప్రారంభం కావడంతో ఇక నుంచైనా తరగతులు సక్రమంగా జరుగుతాయని భావించారు. కానీ ఇప్పుడు విద్యార్ధులకు నిరాశే ఎదురవుతోంది. కళాశాలలు ప్రారంభమై 15 రోజులు గడుస్తున్నా... ఇప్పటికీ సబ్జెక్టు బోధించాల్సిన అతిథి అధ్యాపకులను ప్రభుత్వం విధుల్లోకి తీసుకోలేదు. ఈ కారణంగా వివిధ సబ్జెక్టుల తరగతులు జరగడం లేదు. రెగ్యులర్, కాంట్రాక్టు అధ్యాపకులతోనే ఆ సబ్జెక్టులు కూడా చెప్పిస్తున్నారు. కొన్ని చోట్ల ఆ తరగతులు జరగడం లేదు.
నిబంధనలు పాటించడం కష్టమే
ఇంకా హాస్టళ్లకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో దూర ప్రాంతాల నుంచి పట్టణాలకు వచ్చి, హస్టళ్లలో ఉండి చదువుకునే విద్యార్ధులు.. తరగతులకు హాజరు కావడం లేదు. దీంతో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో హాజరు 40 శాతానికి మించడం లేదు. 40 శాతం విద్యార్ధులు వచ్చినా కొవిడ్ నిబంధనలు పాటిస్తూ తరగతులు నిర్వహించడం కష్టంగా మారింది. ఇంకా 100 శాతం హాజరు ఉంటే పరిస్థితిని అంచనా వేసుకోవచ్చు. కరోనా నిబంధనల అమలు కోసం ఇప్పటికే కొన్ని కళాశాలల్లో ఉదయం, మధ్యాహ్నం షిఫ్టుల వారీగా తరగతులు నిర్వహిస్తున్నారు. పైగా కొవిడ్ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కళాశాల్లో ఇంటర్ విద్యార్ధులు లక్షకుపైగా కొత్తగా చేరారు. విద్యార్ధుల సంఖ్య పెరిగినా... అతిథి అధ్యాపకులను తీసుకోకపోవడంతో ఉన్న అధ్యాపకులకు తరగతుల నిర్వాహణ భారంగా మారింది.