దేవుని భూములంటే(TEMPLE LANDS) చాలు వాటిని ఆక్రమించడం, అక్రమంగా నిర్మాణాలు చేపట్టడం, దేవాదాయశాఖకు ఎలాంటి రుసుములు చెల్లించకుండానే అనుభవించడం పరిపాటిగా మారింది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా(MAHABUBNAGAR DISTRICT)లో ఏళ్లుగా వేల ఎకరాల ఆలయ భూములు అన్యాక్రాంతమవుతూ వస్తున్నాయి. పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఆలయ భూముల కబ్జాల బాగోతాలు కొనసాగుతున్నాయి. మహబూబ్నగర్ జిల్లాలో జడ్చర్ల వెంకటేశ్వర స్వామి ఆలయం పేరిట 102 ఎకరాల భూములుండగా ప్రస్తుతం ఆ భూములన్నీ అన్యాక్రాంతమవుతున్నాయి. వాస్తవానికి ఇవి సర్వీసు ఇనామ్ భూములు. వీటి ద్వారా వచ్చే ఆదాయంలో స్వామి వారికి ధూపదీప నైవేద్యాలు, ఏటా ఉత్సవాలు నిర్వహించాలే తప్ప వీటిని అమ్మడానికి, కొనడానికి వీలులేదు. కానీ కొంతమంది వీటిపై ఓఆర్సీ(అక్యూపెన్సీ రైట్ సర్టిఫికెట్) తెచ్చుకుని ఆ భూముల్లో జోరుగా స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నారు. ఈ భూములపై 143కు పైగా రిజిస్ట్రేషన్లు సైతం అయ్యాయి. ప్రస్తుతం ఈ భూముల్లో వెంచర్లు వెలిశాయి. కొత్త భవనాలు నిర్మితమయ్యాయి. దేవాదాయశాఖ భూముల్లో ఇలాంటి వాటికి అసలు అవకాశమే లేదు. అయినా.. పురపాలక, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖలు తమ ఇష్టానుసారం అనుమతులిచ్చాయి. ఫలితం ఆలయం పేరిట ఇవాళ భూములే లేని దుస్థితి నెలకొంది.
జడ్చర్లలోని దేవాలయ భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. 140 ఎకరాలు ఉన్న భూమి ప్రస్తుతం 4 ఎకరాలే మిగిలింది. దేవాదాయ శాఖ భూముల్లో స్థానిక ప్రజాప్రతినిధులు వెంచర్లు వేసి అక్రమాలకు పాల్పడుతున్నారు. -సత్తయ్య, జడ్చర్ల వాసి
ఉమ్మడి జిల్లాలో 18వేల ఎకరాలకు పైగా దేవాదాయ శాఖ భూములు ఉన్నాయి. జడ్చర్ల పరిధిలో 63 ఎకరాలు ఉంటే 4 నుంచి 5 ఎకరాలు మాత్రమే ఖాళీగా ఉంది. మిగిలిన భూమి అంతా ఆక్రమణలోనే ఉంది. త్వరలోనే సర్వే చేయించి మిగిలిన భూముల్లో బోర్డులు పెట్టిస్తాం. దేవుని మాన్యాలను ఆక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. -శ్రీనివాస రాజు, దేవాదాయ శాఖ సహాయ కమిషనర్, పాలమూరు జిల్లా
గ్రామమే వెలిసింది
వనపర్తి జిల్లాలో వనపర్తి గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ పేరిట 24 ఆలయాలకు కలుపుకుని సుమారు 1284 ఎకరాల భూములున్నాయి. వీటిలో 852 ఎకరాల భూములు సర్వీస్ ఇనాం పేరిట, ఇతరుల పేర్ల మీద, 543 ఎకరాలు దేవాలయాల పేరుతో పట్టాభూములున్నాయి. ప్రస్తుతం దేవాలయాలకు ఎలాంటి ఆదాయం లేకుండా ఈ భూములన్నీ ఇతరుల ఆక్రమణల్లోకి వెళ్లిపోయాయి. కొందరు ఈ భూములతో స్థిరాస్తి వ్యాపారం చేస్తుండగా, దేవాలయానికి ఎలాంటి రుసులు చెల్లించకుండానే కొందరు వాటిని అనుభవిస్తున్నారు. నాగసానిపల్లి, రంగాపూర్, పాలెం, కనిమెట్ట లాంటి గ్రామాల్లో ఇటీవలే ఇతరుల అధీనంలో ఉన్న 125 ఎకరాలను దేవాదాయశాఖ స్వాధీనం చేసుకుంది. మిగిలిన చోట్ల అన్యాక్రాంతమైన భూములను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. నాగర్ కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలంలో 90ఎకరాలు దేవాదాయశాఖ పేరు మీద ఉండగా.. ఆ భూముల్లో ప్రస్తుతం అక్రమ నిర్మాణాలు వెలిశాయి. మరికల్ మండలం పల్లెగడ్డలోని దేవాలయ భూముల్లో ఏకంగా ఓ గ్రామమే నిర్మాణమైంది. ఇలా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దేవుని మాన్యాల్లో కబ్జాలు కొనసాగుతున్నాయి.