How to store grain reserves in Mahabubnagar: ఈ ఏడాది వానాకాలంలో వర్షాలు దంచికొట్టాయి. ఫలితంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో సుమారు 8లక్షల ఎకరాల్లో రైతులు వరిసాగు చేశారు. కొన్నిచోట్ల వరికోతలు సైతం ప్రారంభమయ్యాయి. కొన్ని రోజుల్లో కొనుగోలు కేంద్రాలకు ధాన్యం పోటెత్తుతుంది. గత వానాకాలం, యాసంగిలో ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం ఇంకా మిల్లుల్లోనే మూలుగుతోంది. గత యాసంగికి సంబంధించి 3లక్షల65వేల లక్షల మెట్రిక్ టన్నుల మరాడించిన బియ్యాన్ని పౌర సరఫరాల సంస్థకు అప్పగించాల్సి ఉండగా.. కేవలం 5శాతమే అందించారు. 2021 వానాకాలంలోసైతం 50శాతం మరాడించిన బియ్యాన్నే అప్పగించారు.
దీంతో తాజాగా సేకరించే ధాన్యాన్ని ఎక్కడ దాచిపెడతారనేది ప్రశ్నార్థకంగా మారింది. గత అనుభవాల్ని దృష్టిలో ఉంచుకుని ముందస్తు ఏర్పాట్లు చేస్తేనే .. వానాకాలం ధాన్యం కొనుగోలు సజావుగా సాగే అవకాశం ఉంది. లేదంటే తిప్పలు తప్పవు. మరాడించిన బియ్యం అప్పగించేందుకు ఈ నెలాఖరు వరకూ అవకాశం ఉన్నా.. నెల రోజుల్లో సుమారు 4లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మరాడించడం సాధ్యమయ్యే పనికాదు. ఈసారి సొంత అవసరాలు, ప్రైవేటు మార్కెట్ కు 40శాతం ధాన్యం వెళ్లినా, మిగిలిన 60శాతం ధాన్యం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకే రానుంది. అయితే ఈ ధాన్యం ఎక్కడ నిల్వ చేయాలన్నది మిల్లర్లకు సవాలుగా మారనుంది. సన్నరకం ఎక్కువగా వస్తోంది కావున దీనికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని వెంకటేశ్ జిల్లా వ్యవసాయశాఖ అధికారి తెలిపారు.