తెలంగాణ

telangana

ETV Bharat / state

seasonal fever: విష జ్వరాల పంజా... రోగులతో నిండిపోతున్న ఆస్పత్రులు - తెలంగాణ తాజా వార్తలు

ఉమ్మడి పాలమూరు జిల్లాపై విషజ్వరాలు పంజా విసురుతున్నాయి. మున్సిపాలిటీలు, గ్రామాల్లో డెంగీ, టైఫాయిడ్ సహా ఇతర సీజనల్ వ్యాధుల బారిన పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. జిల్లా ఆస్పత్రులు జ్వరపీడితులతో కిటకిటలాడుతున్నాయి. వ్యాధులు ప్రబలకుండా అన్నిరకాల చర్యలు చేపడుతున్నామని వైద్యారోగ్యశాఖ, మున్సిపల్, పంచాయతీ శాఖలు చెబుతున్నా... జర్వాల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల కురిసిన వర్షాలకు నీరు నిల్వ ఉండే ప్రాంతాలు అధికంగా పెరగడం, అపరిశుభ్ర వాతావరణం, కలుషిత నీరు, ఆహారం విషజ్వరాలు ప్రబలడానికి కారణమని వైద్యులు అంచనా వేస్తున్నారు.

mahabubnagar fevers
mahabubnagar fevers

By

Published : Sep 25, 2021, 8:27 AM IST

seasonal fever:విష జ్వరాల పంజా... రోగులతో నిండిపోతున్న ఆస్పత్రులు

ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లాలో విషజ్వరాలు పంజా విసురుతున్నాయి. జ్వరపీడితులతో జిల్లా ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా డెంగీ, టైఫాయిడ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. పెద్దలతో పాటు 12 ఏళ్ల వయసులోపు పిల్లలూ ఎక్కువగా జ్వరాల బారిన పడుతున్నారు. మహబూబ్​నగర్ జిల్లా ఆస్పత్రికి నిత్యం వెయ్యి నుంచి 1200 మంది బయట నుంచి రోగులు వస్తుండగా.. ఈ నెలలో ఆ సంఖ్య 1800 వరకూ చేరుకుంది. వీరిలో అధిక శాతం మంది జ్వరాలతో వైద్యం కోసం వస్తున్నారు. నిర్ధరణ పరీక్షల్లో డెంగీ, టైఫాయిడ్​ అని తేలడంతో ఆరోగ్యం విషమించిన వారిని ఆస్పత్రిలోనే చేర్చుకొని చికిత్స అందిస్తున్నారు.

జిల్లా వ్యాప్తంగా నెలరన్నర వ్యవధిలోనే 180కి పైగా డెంగీ కేసులు నమోదయ్యాయి. 250 మందికి పైగా టైఫాయిడ్ బారిన పడ్డారు. జలుబు, దగ్గు సహా నీరసం, ఒళ్లు నొప్పులుండి జ్వరం తగ్గని వాళ్లు తక్షణం వైద్యులను సంప్రదించాలని డాక్టర్లు సూచిస్తున్నారు. అపరిశుభ్ర పరిసరాలు, దోమల కారణంగా జ్వరాల సంఖ్య పెరుగుతోందని వైద్యులు చెబుతున్నారు.

నాగర్​కర్నూల్, వనపర్తి, గద్వాల జిల్లా ప్రభుత్వాస్పత్రుల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. పెద్దలతో పాటు ఎక్కువగా పిల్లలు జ్వరాల బారిన పడుతున్నారని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గద్వాల ఆస్పత్రిలో చిన్నపిల్లల వార్డు దాదాపుగా జ్వరపీడితులతోనే నిండిపోయింది. ప్లేట్​లేట్స్​ పడిపోవడంతో ఎక్కువ మందిని ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. పిల్లల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం పాఠశాలలు తెరిచిన నేపథ్యంలో.. అక్కడ వాతావరణం సరిగ్గా ఉండేలా చూడాలంటున్నారు. పిల్లల్లో డెంగీ, టైఫాయిడ్ కేసులు అధికంగా ఉన్నాయి.

ఐదు జిల్లాల్లోని మున్సిపాలిటీల పరిధిలోనే జ్వరపీడితుల సంఖ్య అధికంగా ఉంటోంది. శివారు కాలనీలు, మురుగు కాల్వల వ్యవస్థ లేని ప్రాంతాలు, పారిశుద్ధ్యం పాటించని వీధుల్లో ఎక్కువ మంది జ్వరాల బారిన పడినట్లుగా తెలుస్తోంది. మహబూబ్​నగర్ జిల్లా కేంద్రంలోని బోయపల్లిలో నెలరోజులుగా సుమారు 100 మందికి పైగా జ్వరాల బారిన పడ్డారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ గ్రామాలు విషజ్వరాలకు నిలయంగా మారాయి. పెద్దకొత్తపల్లి నుంచి వచ్చిన పదికి పైగా రోగులు మహబూబ్​నగర్ జనరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఏరియా ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకూ రోగుల తాకిడి పెరిగింది.

దోమల నివారణ, సీజనల్ వ్యాధులపై జనాల్లో అవగాహన కల్పిస్తున్నామని వైద్యారోగ్యశాఖ అధికారులు చెబుతున్నా... జ్వరాలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. మున్సిపాలిటీ, గ్రామపంచాయతీ సిబ్బంది మరోసారి అప్రమత్తమై చర్యలకు దిగాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఇదీచూడండి:Coronavirus: 'థర్డ్‌ వేవ్‌ వచ్చినా.. ప్రభావం తక్కువే'

ABOUT THE AUTHOR

...view details