మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకల్ మండలం కందూరు గ్రామానికి.... ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రముఖ శైవక్షేత్రంగా పేరుంది. రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో జరిగే ఉత్సవాలకు ఏటా వందలాది మంది భక్తులు తరలివస్తుంటారు. కాశీలో మాత్రమే కనిపించే కదంబ వృక్షాలు, కందూరులో దర్శనమిస్తుంటాయి. పురాతన శైవక్షేత్రం మాత్రమే కాదు, కాలగర్భంలో కలిసిన మానవుని చరిత్రకు.. సజీవ సాక్ష్యాలు ఇక్కడ ఉన్నాయని పురావస్తు నిపుణులు చెబుతున్నారు.
ఆదిమానవుని సమాధులు
3వేల 500 ఏళ్ల కిందటి ఇనుప యుగం నాటి ఆదిమానవుని సమాధులు గ్రామ శివారులోని ఓ రైతు పొలంలో దర్శనమిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకూ లభ్యమైన ఆదిమానవుల సమాధులు గుండ్రంగా ఒక వరుసలో మాత్రమే రాళ్లు పేర్చిఉన్నాయి. వీటిని రాకాసి గూళ్లు అని కూడా పూర్వీకులు పిలిచే వాళ్లు. కానీ కందూరులో కనిపించే ఆదిమానవుని సమాధులు రెండు గుండ్రని వరుసల్లో ఉన్నాయని...... అలాంటివి అరుదని పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
చోళుల రాజధానిగా కందూరు
కందూరులోకి ప్రవేశిస్తున్నమార్గంలో ఓ రాయికి గణపతి విగ్రహం చెక్కి ఉంది. రామలింగేశ్వర స్వామి దేవాలయానికి వెళ్తున్న దారిలో గుట్టరాళ్లకు వీరగల్లు, మహిశాసురమర్థిని సహా అనేక చెక్కిన విగ్రహాలు కనిపిస్తాయి. ఊరికి చుట్టుపక్కల ఉన్న గుట్టరాళ్లపై భైరవుడు, సన్యాసి, మునీశ్వరులని చాలా విగ్రహాలున్నాయని గ్రామస్థులు చెబుతున్నారు. ఇవన్నీ గ్రామస్థుల దృష్టిలో సాధారణ విగ్రహాలే అయినప్పటికీ.... కందూరు ఒకప్పుడు చోళుల రాజధానిగా ఉండేదని పురావస్తు నిపుణులు అంటున్నారు.
వీరగల్లు విగ్రహాలు
చాళుక్యులు, కాకతీయులకు సామంతులుగా ఉన్న చోళులు.... క్రీస్తు శకం 1,025 నుంచి 1,248 సంవత్సరం వరకూ పరిపాలన చేశారు. అప్పట్లో వందమంది శత్రువులను చీల్చి చండాడి వీరమరణం పొందిన వీరులకు గుర్తుగా.. వీరగల్లు విగ్రహాలను చెక్కేవారని తెలుస్తోంది. అలాంటివి కందూరులో చాలాచోట్ల ఉన్నాయి. ఇటీవల అభివృద్ధి పనుల కోసం జరిపిన తవ్వకాల్లో చెన్నకేశవస్వామి విగ్రహం సైతం బయటపడగా... దీనిని పల్లె ప్రకృతివనంలో భద్రపరిచారు. 12 శతాబ్దానికి చెందిన కళ్యాణి చాళుక్యుల అద్భుత శిల్పకళా నైపుణ్యానికి ఆ విగ్రహం నిదర్శనమని పురావస్తు నిపుణులు చెబుతున్నారు.
ఇదీ చదవండి:Door Curtain: బాలుడి మెడకు చుట్టుకున్న డోర్ కర్టెన్