పలుకుబడి ఉన్న వారికి ఎక్కువ.. పేదవారికి తక్కువ.. ఇదేం పరిహారం..! - ఉదండాపూర్ తాజా వార్తలు
Higher Compensation For Those with Political Clout: మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం ఉదండాపూర్ జలాశయం ముంపు గ్రామాల నిర్వాసితులకు అందించాల్సిన పరిహారంలో అవకతవకలు చోటుచేసుకున్నాయి. రాజకీయ పలుకుబడి ఉన్న నిర్వాసితులకు ఎక్కువ, పేదవారికి తక్కువ పరిహారం మంజూరు కావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సర్వే సమయంలో అధికారులు తప్పుడు కొలతలు వేశారని, కావాలనే తక్కువ పరిహారం చూపిస్తున్నారని భూనిర్వాసితులు ఆరోపిస్తున్నారు. పరిహారం విషయంలో అన్యాయం జరిగిందంటూ ఉదండాపూర్‌కు చెందిన నిర్వాసిత రైతు ఈనెల 10న నీటికుంటలో పడి ఆత్మహత్య చేసుకున్నారు. తక్కువ పరిహారం మంజూరు చేశారంటూ పేదలు ఆందోళనకు సిద్ధమవుతున్నారు.
Higher Compensation For Those with Political Clout
By
Published : Dec 19, 2022, 7:39 AM IST
Higher Compensation For Those with Political Clout: చిత్రంలో కనిపిస్తున్నది ఓ ప్రజాప్రతినిధి ఇల్లు. యూబీఆర్ నంబరు 370. దీని విస్తీర్ణం 884.22 చదరపు అడుగులుగా చూపారు. ఈ ఇంటికి రూ.23,81,896 పరిహారం నిర్ధారించారు. దీని చుట్టూ మరికొన్ని గృహాలు ఇంకా ఎక్కువ విస్తీర్ణంలో సకల హంగులతో ఉన్నాయి. వాటికి రూ.8 లక్షలు దాటలేదు. ఈ ఒక్క ఇంటికే పరిహారం ఎక్కువగా రావడంపై అభ్యంతరాలున్నాయి.
చిత్రంలో కనిపిస్తున్న రేకులషెడ్డు ఉదండాపూర్ శివారులోని పశువుల కొట్టం. దీనికి యూబీఆర్ 1090 నంబరు ఇచ్చారు. ఎవరూ నివాసం ఉండడం లేదు. అయినా అధికారులు ఈ షెడ్డుకు రూ.8,40,711 పరిహారం చూపారు. ఇదే వైశాల్యంలో స్లాబున్న, మూణ్నాలుగు గదులు, ప్రహరీలున్న అనేక ఇళ్లకు రూ.3 లక్షలలోపే పరిహారం రావడమేంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పరిధిలోని మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం ఉదండాపూర్ జలాశయం ముంపు గ్రామాల నిర్వాసితులకు అందించాల్సిన పరిహారంలో అవకతవకలు చోటుచేసుకున్నాయి. రాజకీయ పలుకుబడి ఉన్న నిర్వాసితులకు ఎక్కువ, పేదవారికి తక్కువ పరిహారం మంజూరు కావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సర్వే సమయంలో అధికారులు తప్పుడు కొలతలు వేశారని, కావాలనే తక్కువ పరిహారం చూపిస్తున్నారని భూనిర్వాసితులు ఆరోపిస్తున్నారు.
పరిహారం విషయంలో అన్యాయం జరిగిందంటూ జడ్చర్ల మండలం ఉదండాపూర్‌కు చెందిన నిర్వాసిత రైతు యాదయ్య ఈనెల 10న నీటికుంటలో పడి ఆత్మహత్య చేసుకున్నారు. తక్కువ పరిహారం మంజూరు చేశారంటూ పేదలు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. విస్తీర్ణంలో ఒకేలా ఉన్న ఇళ్లకూ పరిహారంలో మాత్రం హెచ్చుతగ్గులు కనిపిస్తుండడంతో సర్వే సమయంలోనే పెద్దఎత్తున అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్నారు.
ఉదండాపూర్ జలాశయంలో ముంపునకు గురయ్యే ఉదండాపూర్, వల్లూరు గ్రామాలకు సంబంధించిన ఇళ్లు, ఖాళీస్థలాలు, పశువులపాకలు ఏ మేరకు భూములు కోల్పోనున్నాయో పేర్కొంటూ 2021 సెప్టెంబరు 8న నోటిఫికేషన్ ఇచ్చారు. రాజకీయ జోక్యంతో ఇష్టారాజ్యంగా దాన్నిచ్చారని అప్పట్లోనే విమర్శలు వెల్లువెత్తాయి. క్షేత్రస్థాయిలో ఇళ్లు, ఖాళీస్థలాలున్నా పూర్తిస్థాయిలో చేర్చలేదు. కొందరు రాజకీయ నేతల ఇళ్ల వద్ద ఖాళీ స్థలాలు లేకున్నా ఉన్నట్లు చేర్చారు. ఓ పార్టీకి చెందిన నేతలు ఈ వ్యవహారంలో కీలక భూమిక పోషించినట్లు ఆరోపణలున్నాయి. దీంతో రీసర్వే చేస్తామని అప్పట్లోనే అధికారులు ప్రకటించారు.
మళ్లీ సర్వే చేయకుండానే:పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పరిధిలో ఉదండాపూర్ జలాశయ నిర్మాణం కోసం ఉదండాపూర్ గ్రామంలో భూసేకరణ అవసరముందని గతనెల 17న ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రాజెక్టు కోసం 1,039 నిర్మాణాలున్న భూమిని సేకరిస్తామని తెలిపారు. నోటిఫికేషన్‌లో భూనిర్వాసితుల వివరాలిచ్చారు. ఇటీవల ఇళ్ల పరిహారానికి సంబంధించిన జాబితా బయటకొచ్చింది.
అందులో మొండిగోడలతో ఉన్నవి, రేకుల ఇళ్లు, పూరి గుడిసెలకు రూ.లక్షల్లో పరిహారం మంజూరైంది. స్తంభాలు, స్లాబ్‌లు వేసి పక్కాగా నిర్మించుకున్న వాటికి తక్కువ పరిహారంతో జాబితా రూపొందించారు. పశువుల పాకలకు రూ.లక్షల్లో పరిహారం పొందుపరిచారు. ఈ జలాశయం పరిధిలోనే వల్లూరుకు చెందిన 360 ఇళ్లకూ పరిహారం చెల్లించాల్సి ఉంది. ఇక్కడా పెద్దఎత్తున అవకతవకలు జరిగినట్లు తెలుస్తోంది. దీంతో జాబితా బయటకు రాకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు.
పరిహారం విషయంలో సర్వే సమయంలోనే తప్పుడు కొలతలు వేశారని, రీసర్వే నిర్వహించి న్యాయం చేయాలని నిర్వాసితులు కోరుతున్నారు. కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా.. పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. దీనిపై ఉదండాపూర్ జలాశయం ఈఈ ఉదయ్ శంకర్ మాట్లాడుతూ.. ఎవరికైనా పరిహారం తక్కువగా వచ్చిందన్న అనుమానాలుంటే ముందుగా కొలతలు తీసుకొని పరిశీలించాలన్నారు. అయినా తక్కువగా వచ్చిందని తెలిస్తే తమ దృష్టికి తేవాలని, విషయాన్ని ఉన్నతాధికారులకు చెప్పి రీసర్వేకు అవకాశం కల్పిస్తామని తెలిపారు.