ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ముసురు వర్షాలు జన జీవనాన్ని స్తంభింపజేశాయి.. చెరువులు నిండిపోగా వాగులు ఉద్ధృతంగా ప్రవహించాయి. పట్టణాలు, గ్రామాల్లో శిథిలావస్థకు చేరిన ఇళ్లు, గోడలు పలు చోట్ల కూలిపోయాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 1,477 ఇళ్లు శిథిలావస్థకు చేరినట్లు గుర్తించారని ‘ఈనాడు’లో ఈ నెల 17న ‘గూడు చెదిరింది!’ కథనం ప్రచురితమైంది. కథనంలో అధికారులు వెంటనే దృష్టిసారించి పాక్షికంగా, పూర్తిగా దెబ్బతిన్న ఇళ్లను గుర్తించి తీసుకోవాల్సిన చర్యలు ప్రస్తావనకు వచ్చాయి. మరో మూడు, నాలుగు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉండటంతో యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్న అభిప్రాయం వ్యక్తమైంది. అధికారులు మాత్రం పూర్తి స్థాయిలో దృష్టిసారించకపోవడంతో వర్షానికి మరో ఇల్లు కూలి ముగ్గురు మృతి చెందడం ఉమ్మడి జిల్లావాసులను ఆవేదనకు గురి చేసింది.
ఆ చిన్నారి ఆటల్లో ముందంజ
గండీడ్ మండలం పగిడ్యాలలో మల్లప్ప ఇల్లు కూలిన ప్రమాదంలో మృతి చెందిన ఆయన చిన్న కుమార్తె వైశాలి ఓ ప్రైవేటు పాఠశాలలో మూడో తరగతి పూర్తి చేసింది. ఆమె ఆటల్లో ముందంజలో ఉండేదని పాఠశాల నిర్వాహకులు వెల్లడించారు. వైశాలి అంటే అందరిలోనూ ప్రత్యేక గుర్తింపు ఉండటంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు విషాదంలో మునిగిపోయారు.