ప్రాథమిక విద్య నుంచి పీజీ వరకు ఆన్లైన్ తరగతులు తప్పేలా లేవని దాదాపుగా తేలిపోయింది. ప్రభుత్వం అనుమతి రాకముందే ప్రైవేట్ విద్యా సంస్థలు ఆరో తరగతి నుంచి ఆన్లైన్ తరగతులు ప్రారంభించేశాయి. బీటెక్, బీ-ఫార్మసీ తదితర కోర్సులు కొద్దిరోజుల్లో ఆన్లైన్లోనే ప్రారంభంకానున్నాయి. ఇంటి నుంచి పనిచేసే ఉద్యోగులు సైతం పెరిగిపోయారు. అవకాశం ఉన్న ప్రతిచోటా 30 నుంచి 50శాతం మంది ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేస్తున్నారు. ఫలితంగా ఎలక్ట్రానిక్ వస్తువుల గిరాకీ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆన్లైన్ తరగతుల కోసం తల్లిదండ్రులు ఫోన్లు కొంటున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ల్యాప్టాప్లు కొనుగోలు చేస్తున్నారు. వీటితోపాటు ట్యాబ్స్, వెబ్ కెమెరాలు, సౌండ్ సిస్టమ్, హెడ్ ఫోన్స్, వైఫై రూటర్స్, డాంగిల్స్ వంటి వాటికి నెలరోజుల్లోనే గిరాకీ ఒక్కసారిగా పెరిగింది. 200 రెట్లు అధికంగా అమ్ముడవుతున్నాయని ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే 20 కోట్ల వ్యాపారం జరుగుతోంది.
గతంలో కేవలం ఫోన్ మాట్లాడటానికి మాత్రమే రీఛార్జులు చేసేవాళ్లు.. ఇప్పడు డాటాను సమకూర్చుకుంటున్నారు. ఆన్లైన్ తరగతులు, ఇంటి నుంచే పని చేయాలంటే.. డాటా గతంలో కంటే 200 శాతం అధికంగా అవసరం అవుతోంది. కంప్యూటర్లు, మొబైళ్లు, ల్యాప్టాప్లు రిపేర్లు కూడా అధికమయ్యాయి. వేలు పోసి కొత్తవి కొనడం కంటే.. ఉన్నవాటికి మరమ్మతు మేలనుకుంటున్నారు.