Handloom Workers Problem in Mahabubnagar : రోజురోజుకీ పెరుగుతున్న అధునాతన సాంకేతికత మనుషులకు అనేక రకాలుగా మేలు చేస్తోంది. దీన్ని ఉపయోగించి మానవులు కొన్ని పనులను సులభంగా చేయగలుగుతున్నారు. అయితే ఇదంతా నాణేనికి ఒకవైపే. అదే టెక్నాలజీ కారణంగా కొందరు తమ ఉనికిని కోల్పోయే స్థితిలో ఉన్నారు. దేశంలో అనేక రకాల కుల వృత్తులు చేసుకుని జీవించే వాళ్లున్నారు. ఇలాంటి వారిపై సాంకేతిక టెక్నాలజీ తీవ్ర ప్రభావం చూపుతోంది.
దినదినాభివృద్ధి చెందుతోన్న టెక్నాలజీతో కనిపెట్టిన యంత్రాల వల్ల తమకు పని లేకుండా పోయిందని చేతివృత్తుల వారు వాపోతున్నారు. ఫలితంగా తమ జీవనం ప్రశ్నార్థకంగా మారిందంటున్నారు. ఈ సాంకేతికత అనే కాలగర్భంలో అనేక రంగాలు కలిసిపోయినప్పటికీ కొన్ని వాటి ఉనికికి నేటికీ చాటుతున్నాయి. అందులో చేనేత రంగం కూడా ఒకటి. మన తెలంగాణలో ఈ రంగానికి చెందిన వారు అనేక మంది ఉన్నారు. ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ, కరీంనగర్ వంటి ప్రాంతాల్లో వీరి శాతం అధికం. అయితే వీరిని కష్టాలు వెంటాడుతున్నాయి. అసలే అంతంత మాత్రంగా వస్తున్న డబ్బుతో బతుకీడుస్తున్న వారికి విద్యుత్ బిల్లులు భారం అధికమవుతుంది. బిల్లుల విషయంలో రాయితీలు ఇచ్చి తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లయింది: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గద్వాల పట్టు చీరలు తయారు చేసే చేనేత కార్మికుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పటికే రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితుల్లో ఉన్న వారిపై విద్యుత్ బిల్లుల భారంతో మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లయింది. నేసిన చీరకు గిట్టుబాటు ధర రాక, మాస్టర్ వీవర్స్ ఇచ్చే కూలీ సరిపోక, మగ్గం నేయడానికి ఉపయోగించే కరెంటు బిల్లులు కట్టుకోలేక వారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం కుల వృత్తులను ప్రోత్సహించేందుకు గాను నాయి బ్రాహ్మణులకు, రజకులకు నెలకు 250 యూనిట్ల వరకు విద్యుత్ రాయితీ ఇస్తుంది. వారిని ప్రోత్సహించినట్టుగానే తమకు సాయం చేయాలని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందని చేనేత కుటుంబాలు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాయి.