ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఒకప్పుడు వెయ్యి మంది పురుషులకు సగటున 850 మంది మహిళలు మాత్రమే ఉండేవారు. వైద్య వసతులు మెరుగవడం, పర్యవేక్షణ పెరగడంతో లింగ నిష్పత్తిలో మార్పు కనిపిస్తోంది. గ్రామాల్లో ఆశాలు, ఏఎన్‌ఎంలు ఇంటింటికి వెళ్లి గర్భిణుల వివరాలు సేకరిస్తున్నారు. వారికి ప్రతి నెలా కావాల్సిన వైద్య సదుపాయాలు అందిస్తున్నారు. దీంతోపాటు ప్రజల ఆలోచన సరళిలోనూ మార్పు రావడంతో బాలికల నిష్పత్తి పెరుగుతోంది. కేంద్ర కుటుంబ, ఆరోగ్య సంక్షేమ శాఖ విడుదల చేసిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 2019-20లో ఈ విషయం వెల్లడైంది. ఈ నివేదికలో 104 అంశాలను వెల్లడించగా కొన్ని అంశాలు ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఆ అంశాల ఆధారంగా పాలమూరువాసుల జీవన శైలిలోనూ మార్పు స్పష్టంగా తెలుస్తోంది. దాని ప్రభావం వారి అలవాట్లపై కనిపిస్తోంది.
ఉమ్మడి పాలమూరులో వివక్ష తగ్గింది.. చిట్టితల్లి నవ్వింది..
వెనుకబడిన జిల్లాగా పేరొందిన ఉమ్మడి పాలమూరులో లింగ వివక్ష తగ్గుతోంది.. స్త్రీ శక్తి పెరుగుతోంది.. పురుషుల కన్నా మహిళల నిష్పత్తిలో వృద్ధి నమోదవుతోంది.. ఆడపిల్ల పుడితే అయ్యో అనుకున్న పరిస్థితి నుంచి నేడు మహాలక్ష్మిగా భావించి ఆహ్వానించే పరిస్థితి నెలకొంది.. వెయ్యి మంది పురుషులకు సగటున 1,039 మంది మహిళల నిష్పత్తి నమోదవడమే ఇందుకు నిదర్శనం.
ఆ విషయాల్లో ఆందోళనకరమే...
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఆల్కహాల్, పొగాకు వాడకం పెరగడం ఆందోళనకర విషయమే. పురుషులు ఎక్కువగా ఆల్కహాల్ తాగుతున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో యాభై శాతానికి పైగా పురుషులు ఆల్కహాల్ తాగుతున్నట్లు నివేదికలో వెల్లడైంది. మిగతా నాలుగు జిల్లాలతో పోల్చుకుంటే జోగులాంబ గద్వాల జిల్లాలో ఈ అలవాటు తక్కువగా ఉంది. ఇదే సమయంలో మహిళలు సైతం ఈ అలవాటు బారిన పడటం గమనార్హం. ఉమ్మడి జిల్లాలో సగటున వందలో పది మంది మహిళలు ఆల్కహాల్ లేకుండా ఉండలేకపోతున్నారు.
- ఉమ్మడి జిల్లా ప్రజల జీవన శైలిలో మార్పులు వారి ఆరోగ్యంపై తీవ్రంగా ప్రభావం చూపుతున్నాయి. పురుషులు, మహిళలు అనే తేడా లేకుండా ఎక్కువ మంది మధుమేహం, రక్తపోటు బారిన పడుతున్నారు. వనపర్తి జిల్లాలో ఈ బాధితులు ఎక్కువగా ఉన్నారు. ఈ జిల్లాలో ప్రతి వంద మందిలో 30 మంది బాధితులు ఈ జీవనశైలి వ్యాధులతో సతమతమవుతున్నారు. మిగతా నాలుగు జిల్లాల్లో వందకు 20 మంది బాధితులే. ఒకప్పుడు వ్యవసాయ పనులు చేయడం, కాయకష్టం చేసుకోవడంతోపాటు ఇంటి తిండి తినడంతో చాలా ఆరోగ్యంగా ఉండేవారు. ప్రస్తుతం గ్రామాల్లో సైతం పట్టణ జీవనశైలి కనపడుతోంది. ఫాస్ట్ పుడ్ కేంద్రాలు, రెస్టారెంట్ల భోజనం తినడం పెరిగింది. కాయకష్టం కూడా తగ్గింది. దీంతో రక్తపోటు, మధుమేహం రోగుల బాధితుల సంఖ్య పెరుగుతోంది.
- ఉమ్మడి పాలమూరు జిల్లాలో బాల్య వివాహాల్లో మాత్రం మార్పు రావడం లేదని సర్వే వివరాలతో స్పష్టమవుతోంది. నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఇంకా బాల్య వివాహాలు కొనసాగుతున్నాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో మిగతా జిల్లాలతో పోల్చుకుంటే తగ్గాయి.
- చిన్నారులకు టీకాలు వేయించడం, ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పులు చేసుకునే వారి సంఖ్య ఉమ్మడి జిల్లాలో పెరిగింది. దీంతో పాటు ఉమ్మడిజిల్లాలో 80 శాతానికి పైగా గర్భిణులు ప్రతి నెలా విధిగా ఆస్పత్రులకు వెళ్లి పరీక్షలు చేయించుకోవడం గమనార్హం.