GROUND WATER LEVEL: గత రెండేళ్లుగా సమృద్ధిగా వర్షాలతో వానాకాలంకే కాదు.. యాసంగికీ నీళ్లు సరిపోతాయని భావించి వరి వేసిన పాలమూరు రైతులకు కన్నీళ్లే మిగిలాయి. గత కొద్ది రోజులుగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న క్రమంలో చెరువులు, కుంటలు ఎండిపోయాయి. ఉన్నఫలంగా అనధికార విద్యుత్ కోతలు మొదలవ్వడంతో పంటలు ఎండు ముఖం పడుతున్నాయని రైతులు లబోదిబోమంటున్నారు. బోరుబావుల నుంచి ఆగిఆగి నీరు వస్తుండటంతో పొలం పారటం లేదని వాపోతున్నారు.
మరింత పడిపోయే అవకాశం..
అధిక మొత్తంలో వరి సాగు చేయడంతో నీటి వాడకం పెరిగిందని.. అందువల్లే భూగర్భ జలాలు తగ్గుముఖం పట్టాయని అధికారులు తెలిపారు. రెండు నెలల వ్యవధిలోనే 2 మీటర్ల మేర భూగర్భజలాలు పడిపోయినట్లు వివరించారు. నీటి వాడకం ఇదే విధంగా కొనసాగితే ఏప్రిల్, మేలో మరింత పడిపోయే అవకాశం ఉంటుందని జిల్లా భూగర్భ జల అధికారి రాజేంద్ర కుమార్ తెలిపారు. ఇప్పటి నుంచే నీటిని పొదుపుగా వాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచించారు.